కొడంగల్, జూలై 2 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో నేడు పల్లెలు, తండాలు పచ్చదనంతో పాటు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. అప్పట్లో తండాలు గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండటం వల్ల తండా అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని, తండాలు పంచాయతీలుగా ఏర్పడిన తరువాత తండాలు అభివృద్ధిలో పరుగులు పెట్టినట్లు గిరిజనులు పేర్కొంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ వచ్చినప్పటికీ తండాలు, తండాలుగానే మిగిలిపోయాయి. నేడు సీఎం కేసీఆర్ హయాంలో తండాలకు మహర్దశ ఏర్పడింది. తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కావడమే కాకుండా తండాలను అభివృద్ధి చేసుకునేందుకు అధికారాన్ని అందించి ప్రత్యేకంగా నిధులు మంజూరు కావడంతో తండాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
మండలంలోని పలుగురాళ్లతండా గతంలో పర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. గ్రామ పంచాయతీకి తండా దాదాపు 7 కిలోమీటర్లదూరం. పలుగురాళ్లతండా, ఎక్కచెరువు తండా, గోప్యానాయక్ తండాలు మూడు కలిసి పలుగురాళ్లతండాగా కొత్త పంచాయతీ ఏర్పడింది. ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా మురుగు రోడ్లు, ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలు అన్నట్లుగా ఉండేది. నేడు తండాలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, చెత్త సేకరణకు ట్రాక్టర్, వీధివీధిన సీసీ రోడ్లు, వీధుల్లో రాత్రి పట్టపగలును తలపించే ఎల్ఈడీ బల్బులు వంటి సౌకర్యాలతో తండాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది.
పల్లె ప్రగతి కార్యక్రమంతో తండాలో చెత్త కుప్పలు, మురికి కుంటలు మాయమై రోడ్లు స్వచ్ఛతను సంతరించుకున్నాయి. ప్రతి నెలా తండా అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో తండాలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం కింద నల్లా కనెక్షన్లు పూర్తి కావడంతో ఇంటి ముందు వాకిట్లో స్వచ్ఛమైన కృష్ణాజలాలు రావడం మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ కాలమైనా తాగునీటికి కరువులేదని, గత పాలకుల హయాంలో ఖాళీ బిందెలు పట్టుకొని పొలాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. ఇంటి పక్కనే చెత్త కుప్పలు ఉండటంతో దోమలు, దుర్వాసనల బెడద ఉండేదని, దోమకాటుతో అనారోగ్యాలకు గురి కావాల్సిన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. నేడు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతి రోజూ ఇంటి ముందుకు వచ్చి చెత్తను సేకరించడం వల్ల దోమలు, దుర్వాసన దూరమైనట్లు తెలిపారు. వీధి వీధిలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుతో గ్రామం శుభ్రత కళకళలాడుతున్నట్లు తెలిపారు.
రూ.కోటీ 50లక్షలు మంజూరు..
ఏండ్ల కాలంగా పరిష్కారం కాని తండాకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రూ.కోటీ 50లక్షల బీటీ రోడ్డును మంజూరు చేయించారని, ప్రస్తుతం రోడ్డు టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సర్పంచ్ దీపాబాయి తెలిపారు. అదేవిధంగా లింక్‌రోడ్డుగా హస్నాబాద్ గ్రామం నుంచి పలుగురాళ్లతండా, గోప్యానాయక్‌తండా, ఎక్కచెరువుతండాలను కలుపుకొని బొంరాస్‌పేట మండలంలోని చిల్ముల్ మైల్వార్ వరకు రూ.3కోట్ల 50లక్షలతో బీటీ రోడ్డు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు పూర్తయితే తండాలకు ఇరువైపులా బీటీ రోడ్డు సౌకర్యాలు ఏర్పడతాయని గిరిజనులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సీఎం గిరివికాస్ పథకం కింద 6 బోర్లు మంజూరు..
సీఎం కేసీఆర్ వచ్చిన తరువాత వ్యవసాయం పండుగలా మారిందని, ప్రతి రైతు సంతోషంగా, ఆత్మాభిమానంతో వ్యవసాయం చేసుకుంటున్నట్లు గిరిజనులు తెలిపారు. పంట పెట్టుబడితో పాటు రైతుబీమా పథకాలను అందించి రైతు ఆత్మాభిమానాన్ని పెంచినట్లు పేర్కొన్నారు. పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని గిట్టుబాటు ధరను అందుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా గిరిజనుల వ్యవసాయానికి మరింత సహాయాన్ని అందించే దిశగా సీఎం కేసీఆర్ సీఎం గిరివికాస్ పథకాన్ని అమలు చేసి గిరిజనులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. తండాకు ఇప్పటి వరకు మొత్తంగా 6 బోర్లు మంజూరు చేశారని, వాటి ఏర్పాటుకు దాదాపు రూ.5లక్షలు మంజూరైనట్లు తెలిపారు. మరో 4 బోర్ల మంజూరు నివేదిక అందించినట్లు పేర్కొన్నారు.
అన్ని సౌకర్యాలు..
మా తండా గ్రామ పంచాయతీగా ఏర్పడటంతో అన్నింటా సౌకర్యాలను అందుకుంటున్నాం. దాంతో పాటు తండాలో గల్లీగల్లీకి సీసీ రోడ్లు, ఎల్ఈడీ బల్బ్‌లు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లతో తండాలో చాలా వరకు సమస్యలు తీరాయి. తండాలు అభివృద్ధి చెందుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ సంకల్పంతోనే.
– మోహన్‌నాయక్, పలుగురాళ్లతండా, కొడంగల్
ఎమ్మెల్యే కృషితో తండా అభివృద్ధి..
ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో మా తండా త్వరగా అభివృద్ధికి బాటలు వేసుకున్నది. తండా అభివృద్ధికి సంబంధించి కోరిన వెంటనే నిధులు అందించి, పనుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్న ఎమ్మెల్యేకు మా తండా ప్రజల తరఫున ధన్యవాదాలు. సీసీ రోడ్లతో తండాలో స్వచ్ఛత, ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి నల్లా కనెక్షన్లతో నీటి సమస్య తొలగింది. ప్రతి రోజూ తండాలో చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తుండటం వల్ల చెత్తకుప్పలు కనిపించకుండా పోయాయి.
– దీపాబాయి, సర్పంచ్, పలుగురాళ్లతండా, కొడంగల్