రంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు. మొయినాబాద్, చేవెళ్ల మండల పరిధిలో రోడ్ల నిర్మాణానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి (MP Gaddam Ranjeet Reddy), చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య (Mla Kale Yadaiah) తో కలిసి శంకుస్థాపనులు చేశారు. పలుగుట్ట గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం, గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఒక వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ పథకాలను సమానంగా తీసుకెళ్తుందని అన్నారు. అధిక వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లు దెబ్బతినడంతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండ ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని వెల్లడించారు. సంక్షేమ పథకాలతో నిరుపేదలకు మేలు జరుగుతుందని అన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయని పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ 9Mission Bhagiratha) ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందుతున్నాయని వివరించారు. గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండటానికి పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టామని అన్నారు.