ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అనేక తంటాలు పడాల్సి వస్తున్నది. తాము పండించిన ధాన్యం గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే మండుతున్న ఎండలు.. ఆపై కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేక రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్ గ్రామానికి చెందిన మంగలి గౌరయ్య అనే అన్నదాత తాను పండించిన ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రం వద్ద గత నాలుగు రోజులుగా పడిగాపులు కాసి చివరకు ఎండదెబ్బతో ఆదివారం మృత్యువాతకు గురయ్యాడు. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలాగే ఉన్నది.
– రంగారెడ్డి, మే 4 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా సర్కారు 37 కొనుగోలు కేంద్రాలు హడావిడిగా ప్రారంభించింది. వీటిలో 24 కొనుగోలు కేంద్రాలను సహకార సంఘాల ఆధ్వర్యంలో, 5 కొనుగోలు కేంద్రాలు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. మిగిలిన 8 కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వారం రోజులు కావస్తున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఊపందుకోవడంలేదు.
ఈ సీజన్లో 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాని, ఇప్పటి వరకు కేవలం 512 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి తీవ్ర జాప్యం జరుగుతున్నదని రైతులు వాపోతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక సకాలంలో అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వరికోతలు ముమ్మరమైనాయి. దీంతో అన్నదాతలు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. కాని, కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల ఆంక్షలతోపాటు సకాలంలో కొనుగోలు చేయడంలేదు. ఇప్పటివరకు సగానికి పైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ కనీసం ఐదుశాతం కూడా ధాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు కుప్పలుకుప్పలుగా ఉన్నాయి. రైతులు ప్రతిరోజూ తమ ధాన్యాన్ని విక్రయించుకోవడం కోసం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ధాన్యం పచ్చిగా ఉందన్న నెపంతో అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. వడ్ల నుంచి తాలును వేరుచేసేందుకు వడ్లను తూర్పార పట్టే మిషన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో కూడా తీవ్ర జాన్యం జరుగుతున్నది. కాని, అధికారులు మాత్రం అన్నదాతల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయటంలేదని ఆరోపణలొస్తున్నాయి. వెంటనే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 1.32 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారని వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. కాని, అధికారుల అంచనాలకు మించి రైతులు సాగు చేశారు. యాసంగిలో 50నుంచి 60వేల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని అన్నదాతలు చెప్తున్నారు. కాని, సివిల్ సప్లయ్ అధికారులు మాత్రం 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే దిగుబడి వస్తుందని చెప్తున్నారు. దిగుబడి అంచనాల్లో కూడా అధికారులు సరిగ్గా అంచనాలు వేయలేదని ఆరోపణలున్నాయి. గత సీజన్లో కూడా దిగుబడిపై అధికారులు సరైన అంచనా వేయకపోవడంతో నిర్దేశించిన లక్ష్యం కంటే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకుంది. గ్రామీణ మండలాల్లో అనేక ప్రాంతాల్లో వరి కోతలు ముగిసినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. దీంతో రైతులు గత్యంతరం లేక మధ్యదళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో వరికి గిట్టుబాటు ధర వస్తుందని ఆశించిన అన్నదాతలకు తీవ్ర నిరాశ ఎదురవుతున్నది.
ప్రభుత్వం హడావిడిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా అన్నదాతలు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఎండబెడుతున్నారు. సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు రాత్రి సమయాల్లో కూడా కొనుగోలు కేంద్రాల వద్ద తమ ధాన్యం వద్దే పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా అన్నదాతలు తమ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచారు. మంచాల మండలంలోని నోముల గ్రామంలో డీసీఎంఎస్ కేంద్రంలో రైతులు తమ ధాన్యం తీసుకువచ్చి విక్రయించినప్పటికీ అధికారులు ధాన్యం తీసుకెళ్లటంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని వాపోతున్నారు. ధాన్యం తీసుకెళ్లేందుకు లారీలను పంపాలని కోరినప్పటికీ అధికారులు స్పందించడంలేదన్నారు.