జిల్లాలో రియల్ మాఫియా రెచ్చిపోతున్నది. కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై నకిలీ ఓఆర్సీలు, తప్పుడు పత్రాలు సృష్టించి శివారు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నది. జిల్లాలో ఉన్న నిజాం నవాబుల కాలం నాటి జాగీర్దార్, వక్ఫ్‌బోర్డు, ఇనాం భూములను కాజేసేందుకు శతవిధాలా యత్నిస్తున్నది. ఇప్పటికే జిల్లాలోని శివారు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే భూములపై తప్పుడు పత్రాలు సృష్టించి వాటిని కోర్టులకు సమర్పించి.. ఏండ్ల తరబడిగా వాటిని కోర్టుల్లో పెండింగ్‌లో ఉంచుతూ.. ఆ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నది. ముఖ్యంగా జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని మండలాలు, మున్సిపాలిటీల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో వాటిని కాజేసే కుట్రలకు తెరలేపింది. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను రాత్రికి రాత్రే తప్పుడు పత్రాలను సృష్టించి మాయం చేస్తున్నది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో ప్రజలు, రైతులు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు విలువైన ప్రభుత్వ భూములను కొంతమంది అధికారుల అండదండలతో తప్పుడు ఎన్వోసీలు, పత్రాలు సృష్టించి వాటిని కోర్టులకు సమర్పిస్తున్నారు. ఆ కేసులు కోర్టుల్లో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో.. ఆ భూములకు హెచ్ఎండీఏ అనుమతులు పొంది ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో రోజుకో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.
బాటసింగారంలో తప్పుడు ఎన్వోసీతో ..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో విలువైన ప్రభుత్వ భూమిపై నకిలీ ప్రొసీడింగ్ సృష్టించి సుమారు రూ.వంద కోట్ల విలువచేసే భూమిని కొందరు కాజేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ భూ కుంభకోణం వెలుగులోకి వ చ్చింది. బాటసింగారంలోని సర్వే నం.376లో 220 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ వారు గతంలో వెంచర్ చేశారు. ఈ వెంచర్లో ప్రజా అవసరాల కోసం సుమారు లక్ష గజాలను కేటాయించారు. ఈ భూమిపై అదే గ్రామానికి చెందిన కొంతమంది కన్నేసి.. ఆ స్థలంపై కన్వర్షన్ ప్రొసీడింగ్ సృష్టించారు. దాని ఆధారంగా ఆ భూమిని విక్రయించేందుకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి ఆర్డీవో జారీచేసిన ప్రొసీడింగ్ నకిలీదిగా తేల్చారు. దీంతో విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుడి నుంచి కాపాడారు.
రావిర్యాలలో 172 ఎకరాలకు టోకరా..
మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో 172 ఎకరాల ప్రభుత్వ భూమిపై తప్పుడు పత్రాలు సృష్టించి కాజేసేందుకు కొందరు యత్నించారు. సర్వేనం.354, 355లలో 584 ఎకరాలను నిజాంల కాలంలో కొంతమంది జాగీర్దార్లకు ఈ భూమిని కేటాయించారు. ఆ వ్యవస్థ రద్దు కావడంతో ఆ భూమి ప్రభుత్వానికి చెందిందని అధికారులు నిర్ధారించగా.. ప్రభుత్వం ఈ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చింది. కాగా, ఆ భూమిలోని 172 ఎకరాలను 2007లో ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు ఆస్తిగా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు తాము జాగీర్దార్ల వారసులమని కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు ఉండగానే ఆ భూమిపై గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు ఆర్డీవోలతో కలిసి నకిలీ ప్రొసీడింగ్‌లు, ఓఆర్సీలను సృష్టించారు. వాటి ఆధారంగా ఆ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ఈ భూములు అన్యాక్రాంతమయ్యేందుకు రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు తెరవెనుక చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి. తప్పుడు ప్రొసీడింగ్‌లు, ఓఆర్సీలు జారీ చేసిన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శివారు ప్రాంతాలే టార్గెట్‌గా..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని పలు విలువైన భూములకు రాత్రికి రాత్రే తప్పుడు ప్రొసీడింగ్‌లు, ఓఆర్సీలు పుట్టుకొస్తున్నాయి. వాటి ఆధారంగా అనేక ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తగతమవుతున్నాయి. ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నా.. రాత్రికి రాత్రే వాటిని అక్కడి నుంచి తొలగించి పట్టా భూములుగా మార్చేస్తున్నారు. ఇటీవల ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఓ విలువైన భూమి ప్రభుత్వానిదిగా గుర్తించి అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు. కానీ, ఆ భూమికి రాత్రికి రాత్రే ఓఆర్సీ రావడంతో ఆ జాబితా నుంచి తొలగించారు. ఎమ్మెల్యే జోక్యంతో మళ్లీ ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. అలాగే, నాదర్గుల్ గ్రామంలోనూ ఇనాందారులకు తెలియకుండానే ఆ భూములపై ఇతరులు ఓఆర్సీ తీసుకుని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. విషయం తెలిసి ఇనాందారులు కోర్టును ఆశ్రయించారు. అలాగే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోనూ కొందరు ప్రభుత్వ, ఇనాం భూములపై తప్పుడు ఎన్వోసీలు, ఓఆర్సీలు సృష్టించి కాజేస్తున్నారు.