షాద్‌నగర్/షాద్‌నగర్‌రూరల్/షాద్‌నగర్‌టౌన్, నవంబర్ 2 : తమకు సరిగ్గా భోజనం పెట్టడంలేదని, కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదని, పరీక్షల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రిన్సిపాల్ ఏడాదిగా వేధిస్తున్నదని ఆరోపిస్తూ ఫరూఖ్‌నగర్ మండలంలోని కమ్మదనం గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ మహిళా, బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు వందలాదిగా ఆదివారం ఉదయం షాద్‌నగర్ బైపాస్ రోడ్డు, పట్టణ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. ఈ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకొచ్చిందో.. వచ్చినప్పటి నుంచి అన్నీ సమస్యలే ఉన్నాయని.. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా బాగుండేనని గుర్తు చేశారు.
గురుకులాల నిర్వహణరె ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విద్యార్థినుల ఆందోళనకు టీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలుపడంతో షాద్‌నగర్ చౌరస్తా ఉద్రిక్తంగా మారింది. దాదాపు రెండు గంటలపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొన్నది. ఆందోళన చేపట్టిన విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నేతలను షాద్‌నగర్ పోలీసులు చెదరగొట్టేందుకు యత్నించగా విద్యార్థినులు వారికి ఎదురుతిరిగారు. ఓ కానిస్టేబుల్ విద్యార్థినిపై దాడి చేయగా .. సివిల్ డ్రస్‌లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై పలువురు విద్యార్థినులు దాడికి యత్నించారు. అనంతరం పోలీసులు విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నేతలను చెదరగొట్టి స్థానిక ఠాణాకు తరలించారు.
విద్యార్థినుల ఆందోళనను తెలుసుకున్న గురుకుల విద్యాసంస్థల జోనల్ అధికారి నిర్మల, ఏసీపీ లక్ష్మీనారాయణ గురుకుల కళాశాలను సందర్శించి ధర్నాకు సంబంధించి వివరాలను విద్యార్థినులు, అధ్యాపకులు, విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలను సేకరించారు. విద్యార్థినులను ఇబ్బందిపెడుతున్న ప్రిన్సిపాల్ శైలజను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ తాలుకా అధ్యక్షుడు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
షాద్‌నగర్ పట్టణ ముఖ్యకూడలి వద్ద విద్యార్థినులు చేపట్టిన ఆందోళనకు వారు మద్దతు తెలిపి మాట్లాడుతూ.. పరీక్ష ఫీజు పేరుతో విద్యార్థినుల తల్లిదండ్రులను ఇబ్బందిపెడుతున్నదని.. కళాశాలలో సుమారు 500 మంది విద్యార్థినులుండగా, వారిలో సగం మందికిపైగా సరిగ్గా భోజనమే అందడంలేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్ ఇబ్బందులు భరించలేక విద్యార్థినులు రోడ్డెక్కారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు సంజ్, ప్రవీణ్, రాజేశ్, సాయి, జగన్, రాజేశ్, వెంకట్, శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ నాయకులు అదిల్, చరణ్, మహేశ్, చింటూ, శివ, రమేశ్, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.