బన్సీలాల్‌పేట, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖాన పోలీసు క్యాంపు ఆఫీస్‌గా మారింది. దవాఖాన చుట్టూ ఎటు చూసినా పోలీసులు కనిపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఏమి జరుగుతుందో తెలియక కొంత మంది రోగులు దవాఖాన బయటి నుంచే వెనుదిరిగారు. గత నెలలో జరిగిన మాతా శిశు మరణాల నేపథ్యంలో దవాఖానలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
జరిగిన ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు సోమవారం గాంధీ దవాఖానకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కమిటీ సభ్యులు, వారికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు దవాఖానకు వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఉదయం నుంచే దవాఖాన వద్ద భారీగా మోహరించారు.
ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గాంధీ దవాఖానకు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగడంతో వారిని అరెస్టు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ… ప్రజాపాలనలో ప్రజల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందన్నారు. మాతా, శిశు మరణాల గురించి తెలుసుకునేందుకు వస్తే అడ్డుకుని, అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు.
చిన్నారులు పిట్టల్లా రాలిపోతుంటే వివరాలు తెలుసుకోవడం తప్పా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహా, విజయ్‌శంకర్, కే.దేవేందర్, మరికొందరు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి చిలకలగూడ పీఎస్‌కు తరలించారు. సాయంత్రం వారిని సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. మెట్టుగూడ కార్పొరేటర్ సునీత, నాయకులు ఎస్.రాజేందర్, శ్రీనివాస్, ఓ.రాజు, అనిత వారికి మద్దతుగా పీఎస్‌కు వచ్చారు.
దేశద్రోహుల వలే తీసుకెళ్లారు..
– మాజీ ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, సెప్టెంబర్ 23 : పోలీసులు దేశద్రోహుల వలే మమ్మల్ని వాహనాల్లో తీసుకెళ్లారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. సోమవారం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులం గాంధీ దవాఖానకు వెళ్లగా అక్కడ పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వాహనాల్లో దేశద్రోహులు, నక్సలైట్ల మాదిరిగా తరలించారు. ప్రజలకు మేలు చేయాలనుకుంటే ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేయడం సరికాదన్నారు.