తాండూరు, నవంబర్ 16 : తాండూరు నియోజకవర్గంలోని సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటూ రోహిత్‌రెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి స్వచ్ఛందంగా చేరుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పి.రోహిత్‌రెడ్డి గెలుపునకు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు 13 రోజులే గడువు ఉండడంతో అన్నీ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.
ప్రత్యేక ప్రణాళికతో ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్కు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా వందలాది మంది ప్రజలు రోహిత్‌రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు హారతులిస్తూ.. యువకులు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ.. బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీలోని నాయకులు తమ మనుగడ కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆ పార్టీ క్యాడరే విమర్శిస్తున్నది. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టగల వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ గాలం వేసి పట్టుకుందని, ప్రజాసేవ చేసే వారికంటే డబ్బులు ఖర్చు పెట్టే వారికే టికెట్లు అమ్ముకుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటూ తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ కేటాయించి బీఫాం ఇవ్వడంతో ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక మెజార్టీతో తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్‌రెడ్డిని గెలిపించుకుంటామని ముక్తకంఠంతో ముందుకెళ్తున్నారు.
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎకరానికి రూ.16వేల రైతు బంధు, సౌభాగ్యలక్ష్మి పేరుతో పేద మహిళలకు రూ.3000 భృతి, రూ.400లకే వంటగ్యాస్, ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా సౌకర్యం, కేసీఆర్ ఆరోగ్యరక్ష ద్వారా వైద్య చికిత్సలకు రూ.15 లక్షలు, రేషన్‌పై సన్నబియ్యం, అర్హులైన వారికి రూ.5016 ఆసరా పెన్షన్లు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, స్వశక్తి మహిళా గ్రూపులకు భవనాలతో పాటు పలు పథకాలను ప్రకటించడంతో కుల సంఘాల ప్రతినిధులు రోహిత్‌రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.
నీ వెంటే మేము..మీ గెలుపు మా భరోసా అంటూ హామీ ఇస్తున్నారు. స్వచ్ఛందగా బీఆర్ఎస్లోకి చేరుతున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో తెలంగాణను నంబర్-1 రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి పోయే వారు కేవలం డబ్బులకు అమ్ముడు పోయినవారేనని స్థానిక నేతలు, ప్రజలు పేర్కొంటున్నారు.