కడ్తాల్/శంకర్పల్లి/దోమ/కులకచర్ల, డిసెంబర్ 23 : ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి, శంకర్పల్లి, దోమ, కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టగా.. పలు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు రూ.18వేల వేతనాన్ని చెల్లించాలని, ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారికి వేతనాన్ని పెంచడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషకాలను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా అమలు చేయాలన్నారు. మూడేండ్లుగా పెండింగ్లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులతోపాటు డిసెంబర్ నెలలో చేసే లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న పల్స్ పోలియో, స్థానిక సంస్థల ఎన్నికల విధులకు సంబంధించిన డబ్బులను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. ఆశాలకు ఏటా 20 రోజుల వేతనంతో కూడిన సాధారణ సెలవులు ఇవ్వడంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు అందించాలన్నారు.
పారితోషకం చెల్లించని అనేక పనులు ఆశా కార్యకర్తలతో చేయిస్తున్నారని, వారికి పని భారం పెరిగిందని, డబ్బులు చెల్లించని పనులు వారితో చేయించకూడదని తెలిపారు. ఆన్లైన్ సర్వే పనులను రద్దు చేయాలని పేర్కొన్నారు. డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన పేషెంట్లతోపాటు రెండు మూడు రోజులు సైతం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తున్నదని.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.