ఇబ్రహీంపట్నం, జూన్ 2 : సకల జనులను ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహనీయుడు ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం కేవలం పరిపాలన విభజన మాత్రమే కాదని, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని గుర్తు చేశారు. ఎన్నో పోరాటాలు, తాగ్యాలతో సాధించుకున్న తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలుపెరగని పోరాటంతోనే రాష్ట్రం సిద్ధించిందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే… 30 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దుర్భిక్షంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ శ్రీకారం చూడితే.. ఆ పథకాలను రేవంత్ సర్కార్ కోతపెడుతున్నదని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, దండెం రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్, కౌన్సిలర్లు మమతారాజు, బుగ్గరాములు, నీలం శ్వేతబాలు, జ్యోతీవెంకట్రెడ్డి, శంకర్, లక్ష్మీగోపాల్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.