రంగారెడ్డి జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆశించిన స్థాయిలో కదలిక లేదు. సిబ్బంది కొరతతో కుప్పలు తెప్పలుగా ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిశీలించడం అధికారులకు పరీక్షే అవుతున్నది. మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలో 2,37,259 దరఖాస్తులు, మండలాల పరిధిలో 63వేలకు పైగా దరఖాస్తులు క్రమబద్ధీకరణ కోసం వచ్చాయి. ఫీజు భారంతోనూ చాలామంది దరఖాస్తుదారులు క్రమబద్దీకరణకు ముందుకు రావడం లేదు. మూడు నెలల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. గడువులోగా పూర్తవ్వడం కష్టమేనని తెలుస్తున్నది.
– రంగారెడ్డి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లా విభజన తర్వాత స్థిరాస్తి వ్యాపారం ఊపందుకున్నది. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం వెంచర్లు చేసి ప్లాట్లుగా విక్రయించారు. ఇందులో నివాసయోగ్యమైనవే కాకుండా వ్యవసాయ భూములు, ప్రభుత్వ సీలింగ్, చెరువు శిఖం, అసైన్డ్ భూములతోపాటు నాలాలు, గుట్టలు, గట్లను కూడా ప్లాట్లుగా మార్చేశారు. వీటికి గత ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు నిరాకరించి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి.
పెండింగ్‌లో ఉన్న ఈ దరఖాస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కారణాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 35,837 దరఖాస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయి. 3,458 దరఖాస్తులకు మాత్రమే ఇప్పటి వరకు ఆమోదం తెలిపారు. వీటిలో 1,110 దరఖాస్తులకు మాత్రమే ఫీజు చెల్లించి దరఖాస్తుదారులు క్రమబద్ధీకరించుకున్నారు. ఇంకా 2,348 మంది క్రమబద్ధీకరణ రుసుమును చెల్లించలేదు. 1,96,154 దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 45 బృందాలను, గ్రామ పంచాయతీల పరిధిలో 18 బృందాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, నీటి పారుదల, వార్డు అధికారులనూ బృందాల్లో భాగస్వామ్యులను చేశారు.
పంచాయతీల్లో కార్యదర్శి, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వాటిలో అనధికార లే అవుట్లు మున్సిపాలిటీల్లో 671 ఉండగా, పంచాయతీల్లోనే అత్యధికంగా 1,001 వరకు ఉన్నాయి. ఆయా శాఖల అధికారులు లే అవుట్లను పరిశీలించి కోర్టు కేసులు, ప్రభుత్వ, అసైన్డ్ భూములు, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నది. మార్గదర్శకాలకు లోబడి ప్లాట్లు ఉంటే కొలతలు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తేదీ, ఆ సమయంలో మార్కెట్ ధరల వంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇందుకు ఒక్కో దరఖాస్తుకు గంట నుంచి రెండు గంటల సమయం పడుతున్నదని అధికారులు చెబుతున్నారు. వివిధ శాఖల అధికారులు వారివారి శాఖల పనులతోనే సతమతమవుతుండగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించేందుకు సమయం దొరకడం లేదు. ఈ కారణంగానూ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.
గత ప్రభుత్వ హయాంలో ప్లాట్ల క్రమబద్ధీ కరణకు రూ.1,000 చలాన్ కట్టి తీసుకుని దరఖాస్తు చేసుకున్నారు. ఈ రుసుమును వసూలు చేయడంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎల్ఆర్ఎస్కు రుసుమును రద్దు చేయాలని డిమాండ్ చేసిన నాటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తుండడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తుండడం.. కొనుగోలు చేసిన ప్లాట్ ధరతో ఎల్ఆర్ఎస్ ఫీజు సమానంగా ఉంటుండడంతో చాలామంది దరఖాస్తుదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే ఇండ్లు కట్టుకున్న వారు సైతం ముందుకు రావడం లేదు.