వికారాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పంచాయతీ ఎన్నికల వేళ హస్తం పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మొన్న టి వరకు వెనుకుండి రాజకీయం చేసిన నాయకులు లోకల్ ఫైట్‌లో నేరుగా తమ ప్రత్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేసినట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఏ గ్రామం లో అయితే ప్రత్యర్థి పోటీ చేస్తున్నా రో సంబంధిత గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులతో రహస్యంగా సమావేశమై ఓడించేందుకు చేయాల్సినవన్నీ చేసినట్లు బాధిత కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేతోపాటు అధిష్ఠానానికి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.
రూ.కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ నాయకులే ఓడించేందుకు కుట్రలు చేయడంపై జిల్లా అంతటా చర్చానీయాంశంగా మారింది. మర్పల్లి మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన వార్డు సభ్యులందరికీ 400 ఓట్ల వరకు మెజార్టీ వస్తే, సర్పంచ్ అభ్యర్థికి మాత్రం కేవలం 120 ఓట్ల మెజార్టీ రావడంపై ఆ పార్టీ నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిపై ఈ విధంగా కుట్రలు చేసి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఓడించేందుకు చూస్తే పార్టీలో కొనసాగడం కష్టమని..ఈ విషయాన్ని వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ ప్రసాద్‌కుమార్ దృష్టికి సదరు సర్పంచ్ తీసుకెళ్లినట్లు తెలిసింది.

స్పీకర్ ఇలాకాలో కోల్డ్‌వార్..
పంచాయతీ ఎన్నికల వేళ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇలాకాలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. లోకల్ ఫైట్‌లో కాంగ్రెస్ పార్టీకి కొందరు నాయకులు చేసిన కుట్రలు స్పీకర్‌కు తలనొప్పిగా మారా యి. వికారాబాద్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు…వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. పార్టీలో ఉంటూ పార్టీ నుంచి పోటీ చేసిన వారిని ఓడించేందుకు కుట్ర చేశారంటూ కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్‌రెడ్డిపై ఆ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న సుధాకర్‌రెడ్డి ఫ్లెక్సీలను వికారాబాద్ మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అనుచరులు చించివేసి.. అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వెంటనే పార్టీకి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజశేఖర్‌రెడ్డితోపాటు మదన్‌పల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి టౌన్ ప్రెసిడెంట్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి స్వగ్రామం వికారాబాద్ మండలంలోని మదన్‌పల్లి. అక్కడ అతడు తన తల్లిని సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దింపాడు. ఆమెను ఓడించేందుకు వికారాబాద్ పట్టణాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ఆ ఊరికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులకు డబ్బులివ్వడంతోపాటు కార్యకర్తలకు మందు, విందు పార్టీలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. అం తేకాకుండా రాజశేఖర్‌రెడ్డి తల్లికి పోటీగా బీజేపీకి చెందిన వ్యక్తిని బరి లో దింపి తన కేడర్‌తో సుధాకర్‌రెడ్డి ప్రచారం చేయినట్లు రాజశేఖర్‌రెడ్డి అనుచరులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.
స్పీకర్‌కు సన్నిహితంగా ఉండే సుధాకర్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పోస్టును ఆశించాడు. అయితే, ఆ పార్టీ అధిష్ఠానం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని డీసీసీగా నియమించడంతో అప్పటి నుంచి స్పీకర్‌పై అత డు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. డీసీసీ అధ్యక్ష పదవి రాకపోవడంతో నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి స్పీకర్ ప్రసాద్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్.. అతడిని దూ రం పెట్టినట్టు సమాచారం. గతంలో సుధాకర్‌రెడ్డి ఏ పని చెప్పినా పోలీసులతోపాటు అన్ని విభాగాల అధికారు లు చేసిపెట్టేవారు. గత రెండు నెలలుగా అన్ని శాఖల అధికారులు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన టౌ న్ ప్రెసిడెంట్‌కు స్పందించడంలేదని ప్రచారం జరుగుతున్నది. సుధాకర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు.. అందుకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
సుధాకర్రెడ్డ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి…
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితోపాటు మరికొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించారు. సర్పంచ్‌గా బరిలో నిలిచిన మా అమ్మ గెలవద్దొనే ఉద్దేశంతో పోటీగా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి.. మా అమ్మకు ఓట్లు వేయొద్దని వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ విషయాన్ని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తోపాటు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లా. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సుధాకర్‌రెడ్డిలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులకు సుధాకర్‌రెడ్డి ఫోన్ చేసి మా అమ్మకు ఓటు వేయొద్దని చెప్పిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. నేను కూడా డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నా. దానిని దృష్టిలో పెట్టుకొనే సుధాకర్‌రెడ్డి మా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పని చేశారు.