కుల వృత్తుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సర్కార్ గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. తొలివిడుతలో అందజేసిన గొర్రెల యూనిట్లతో ఎంతోమంది లబ్ధిదారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. ప్రస్తుతం రెండో విడుత గొర్రెల పంపిణీకి వికారాబాద్ జిల్లా అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి అవగాహన కల్పిస్తున్నారు. రెండో విడుతలో భాగంగా జిల్లాలో12,111 మందికి గొర్రెల యూనిట్లను అందించనున్నారు. పక్క రాష్ర్టాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 20 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలుతో కూడిన యూనిట్ విలువ రూ.1,75,000లకు పెంచారు.
-బొంరాస్‌పేట, ఏప్రిల్ 19
బొంరాస్‌పేట, ఏప్రిల్ 19 : కుల వృత్తులు, చేతి వృత్తులపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా వారికి జీవనోపాధి కల్పించడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గొల్ల కురుమల ప్రధాన జీవనోపాధి అయిన గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. గొర్రె కాపరుల సంఘాలలో సభ్యులుగా ఉన్నవారికి రాయితీపై గొర్రె పిల్లలను పంపిణీ చేసి వారికి జీవనోపాధి కల్పించడమే కాకుండా రాష్ట్రంలో గొర్రెల సంతతిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. గొర్రె కాపరుల సంఘాలలోని సగం మందికి 2017లో గొర్రె పిల్లలను పంపిణీ చేయగా, మళ్లీ ఈ నెలలోనే రెండో విడుతలో మిగిలినవారికి గొర్రెల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. 21 గొర్రెపిల్లల (20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు) యూనిట్ విలువ రూ.1,75,000. ఇందులో ప్రభుత్వం రూ.1,31,250 రాయితీ(75 శాతం) ఇస్తుండగా, లబ్ధిదారుడు తన వాటాగా రూ.43,750లను(25 శాతం) నెఫ్ట్ ద్వారా కలెక్టర్ ఖాతాలో జమ చేయాలి. రెండో విడుత పంపిణీ ప్రక్రియపై గొర్రెల కాపరులకు పశుసంవర్ధక శాఖ అధికారులు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వం 75 శాతం రాయితీ ఇస్తున్నది. మొదటి విడుతలో గొర్రెలు పంపిణీ చేసిన సమయంలో యూనిట్ విలువ రూ.1.25 లక్షలు ఉండేది. దీనిలో రూ.93,500 ప్రభుత్వం రాయితీ రూపంలో ఇవ్వగా, మిగతా రూ.31,500 లబ్ధిదారులు తమ వాటాగా డీడీల రూపంలో చెల్లించేవారు. కరోనా తరువాత గొర్రెల ధరలు పెరిగినందున రెండో విడుతలో పంపిణీ చేసే గొర్రెల యూనిట్ విలువను ప్రభుత్వం రూ.1.75 లక్షలకు పెంచింది. దీనిలో రూ.1,31,250 రాయితీ ఇస్తుండగా, మిగతా రూ.43,750 లబ్ధిదారుడు తన వాటగా డీడీ రూపంలో కాకుండా నెఫ్ట్ ద్వారా బ్యాంకులో జిల్లా కలెక్టర్ ఖాతాలో జమచేయాలి. లబ్ధిదారులు వర్చువల్ ఐడీ 20 ద్వారా వాటా ధనాన్ని జమచేయాలి.
గొర్రెలకు బీమా
లబ్ధిదారుడు కొనుగోలు చేసిన గొర్రెలకు ప్రభుత్వం బీమా సదుపాయం కూడా కల్పించింది. ఒక యూనిట్‌కు(20 గొర్రెలు, ఒక పొట్టేలు) రూ.5000 ప్రీమియంగా యూనిట్ విలువ నుంచే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏడాదిలోపు గొర్రెలు చనిపోతే ఒకదానికి రూ.7400, పొట్టేలు చనిపోతే రూ.10 వేలు బీమా పరిహారం అందుతుంది. సద్వినియోగం చేసుకోవాలి
– డాక్టర్ అనిల్ కుమార్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి
గొర్రెల పంపిణీ పథకం చాలా మంచిది. కుల వృత్తులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దమొత్తంలో రాయితీ కల్పించి గొర్రెలను పంపిణీ చేస్తున్నది. దీనిని గొర్రెల కాపరులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి.
వికారాబాద్ జిల్లాలో 319 సంఘాలు
వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో 319 గొర్రెల కాపరుల సంఘాలు ఉన్నాయి. ఇందులో 23,431 మంది గొర్రెల కాపరులు సభ్యులుగా ఉన్నారు. 2017లో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి అధికారులు గ్రామసభలను నిర్వహించి మొదటి విడుతలో 11,320 మందికి గొర్రెలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని 10,904 మందికి పంపిణీ చేశారు. మిగిలిన వారికి రెండో విడుతలో గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. రెండో విడుతలో 12,111మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించి వీరందరికీ గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే 11,512 మంది లబ్ధిదారుల పేర్లను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. రెండో విడుత గొర్రెల పంపిణీపై గొర్రెల కాపరుల సంఘాలకు పశుసంవర్ధక శాఖ అధికారులు మండలాలవారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రెండు నుంచి ఆరు నెలల్లో పంపిణీ
లబ్ధిదారుడు తన వాటా డబ్బులు చెల్లించిన తరువాత ప్రభుత్వం వీరికి రాయితీ మంజూరు చేస్తుంది. రాయితీ మంజూరైన ఆరు నెలల్లో గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తారు. ఇతర రాష్ర్టాలలో ఉన్న మేలిరకం గొర్రెలను అధికారులు ఇప్పిస్తారు. వికారాబాద్ జిల్లాలోని లబ్ధిదారులకు గొర్రెలను కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కర్ణాటకలోని యాదగిరి, మహారాష్ట్రలోని లాతూరు, పర్బణి జిల్లాలను అధికారులు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన జిల్లాల నుంచి మన రాష్ట్రంలోకి గొర్రెలను తరలించడానికి పశుసంవర్ధక శాఖ అధికారులు ఐదుగురు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. గొర్రెలు లబ్ధిదారునికి పంపిణీ చేసిన తరువాత రూ.3500 విలువ చేసే దాణా, రూ.500 విలువ చేసే మందులు ఉచితంగా అందజేస్తారు.