రంగారెడ్డి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : రైతులు పత్తిని విక్రయించాలంటే స్లాట్బుకింగ్ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రైతులు ఏడురోజుల ముందే స్లాట్ బుకిం గ్ చేసుకుంటేనే జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు పత్తిని కొనేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యం లో కొత్త నిబంధనలతో పత్తి రైతులు లబోదిబోమంటున్నారు.
జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో రైతులు 20 మండలాల్లో పత్తిని సాగు చేశారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు.. గతంలో సీసీఐ ఆధ్వర్యంలో పలు జిన్నింగ్ మిల్లులకు పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు పాస్‌బుక్‌లతో రైతులు వెళ్తే పత్తిని కొనేవారు. కొనుగోలు చేసిన పత్తికి సంబంధించిన డబ్బును సంబంధిత రైతుల ఖాతాల్లో జమచేసేవారు. కానీ, ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతుల పత్తినే కొనేలా నిబంధనలు తీసుకొచ్చింది.
ఇందుకోసం సీసీఐ వెబ్సైట్లో పత్తిని విక్రయించే రైతులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తమకు అనుకూలంగా, దగ్గరగా ఉన్న జిన్నింగ్ మిల్లులోని కొనుగోలు కేంద్రాన్ని ఎంపిక చేసుకుని అక్కడ విక్రయించాల్సి ఉం టుంది. కొత్తరకం నిబంధనతో రైతులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. తమకు వ్యవసాయ పనులు చేసుకోవడం తప్పా…స్లాట్ బుకింగ్ వంటివి తెలియవని.. తమ పత్తిని విక్రయించుకోవాలంటే మరొక్కరి వద్దకెళ్లి స్లాట్‌బుకింగ్ చేయించుకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు. మరికొంతమంది రైతులు ఈ నిబంధనలు తెలియక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మి పత్తిని అమ్మి నష్టపోతున్నారు. వారికి పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొన్నది.
జిల్లాలోని గ్రామీణ మండలాల్లో ఈ వానకాలంలో 1,37,475 ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేశారు. యాచారం, కందుకూరు, మహేశ్వరం, మాడ్గుల, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, షాబాద్, చేవెళ్ల, మంచాల వంటి మండలాల్లో ఈ పంట సాగైది. జిల్లాలో అత్యధికంగా మాడ్గుల మండలంలో సుమారు 50,000 ఎకరాల్లో రైతులు ఈ పంటను సాగు చేయగా.. అందులో అత్యధికంగా నిరక్ష్యరాసులే ఉన్నారు. దీంతో వారు నేరుగా కొనుగోలు కేంద్రాలకెళ్లి అమ్ముకునే అవ కాశం లేకుండా పోయిం ది. స్లాట్ బుకింగ్ నిబంధనలు వారికి తెలియక అయోమయస్థితిలో ఉన్నా రు. కాగా, జిల్లాలో 1,10,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచ నా వేశారు.
15 కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలోని పలు జిమ్మింగ్ మిల్లుల్లో 15 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. షాద్‌నగర్ డివిజన్లో 11, కొత్తూరులో 2, ఆమనగల్లులో 3, ఆకుతోటపల్లిలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులు స్లాట్ బుకింగ్ ఉంటేనే కొంటారు. ప్రభుత్వం క్వింటాల్ మద్దతు ధర రూ. 8,110గా నిర్ణయించింది.
కష్టపడి పండించిన పత్తిని విక్రయించేందుకు సర్కారు తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానం తెలియదు. పండించిన పత్తిని నేరుగా సర్కారే కొనాల్సింది పోయి ఈ నూతన విధానాన్ని తీసుకురావడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. రైతుల్లో చాలామంది తీవ్రఇబ్బంది పడుతున్నారు.
-కాస నర్సింహ, నల్లచెరువు
స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభు త్వం వెంటనే తీసేయాలి. ఈ విధానం రైతులకు ఇబ్బందికరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అన్నదాతలకు ఈ స్లాట్ బుకింగ్ పద్ధతి తెలియదు. వారు బుకింగ్‌లు చేయలేరు. ప్రభుత్వం స్పందించి నేరుగా రైతుల నుంచే పత్తిని కొనుగోలు చేయాలి.
-కట్ట మల్లేశ్, రైతు