వికారాబాద్, నవంబర్ 12, (నమస్తే తెలంగాణ): అరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం..మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతీ రైతుకు మద్దతు ధర అందించే విధంగా చర్యలు చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల విషయంలో అన్నింటిలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వరి కోతకు వచ్చిన సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరిపించేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పంటలను పండిస్తున్న రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల్లో కూరుకుపోతుండడం గమనార్హం. జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులు వరి కోతలు పూర్తి చేసి వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. రైతులు వరి కోతలు పూర్తి చేసి కల్లాలు, రోడ్లపై ఆరబెట్టి ఎప్పుడెప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా అని పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు దాపురించాయి.
ఇంకా ప్రారంభంకాని కొనుగోళ్లు…
జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. జిల్లావ్యాప్తంగా వరి కోతలు 80 శాతానికిపైగా పూర్తి కావడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధం చేసినా కోనుగోలు చేయడానికి ప్రభుత్వం ఇంకా కాంటా వేయకపోవడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా వానకాలం సీజన్లో 1.30 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 3.80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అదేవిధంగా వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకుగాను జిల్లావ్యాప్తంగా 129 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది.
ఇందులో బుధవారం వరకు 15 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే సంబంధిత కేంద్రాలను ప్రారంభించారే తప్ప రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడం మాత్రం ఇంకా ప్రారంభించకపోవడం గమనార్హం. అయితే గత నెల రోజుల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు సమావేశాలు నిర్వహించినా…ధాన్యం కొనుగోళ్లలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలో బిజీగా ఉండడంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో జిల్లా పౌరసరఫరాల అధికారులు ఆలస్యం చేసినట్లు తెలిసింది.
ఎన్నికల ప్రచారం ముగియడంతో బుధవారం నుండి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం మొదలుపెట్టారు. కొనుగోళ్లు షురూ కాకపోవడంతో రైతులు ధాన్యాన్ని ఆరబోసిన కల్లాలు, రోడ్ల వద్దనే తీవ్ర చలిలోనే రాత్రి, పగలు పడిగాపులు కాస్తున్నారు. అయితే అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతోపాటు ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించాలని జిల్లా రైతాంగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అయితే జిల్లావ్యాప్తంగా 129 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించగా, వీటిలో ఐకేపీ ద్వారా 42 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 49 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా 38 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. వీటిలో సన్నరకం వడ్లను కొనుగోలు చేసేందుకు 11 కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయించింది. అదేవిధంగా రైతులకు అందించే మద్దతు ధరకు సంబంధించి క్వింటాలుకు ఏ గ్రేడ్ రూ.2389లు, సాధారణ రకం క్వింటాలుకు రూ.2369లుగా ప్రభుత్వం నిర్ణయించింది.