వికారాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంపై జిల్లా రైతాంగం భగ్గుమన్నది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లాకు సాగు నీరందడం కష్టమనుకున్న తరుణంలో గత కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి భరోసా తీసుకొచ్చింది. అయితే, పాలమూరు ప్రాజెక్టు విషయంలో అడుగడుగునా కేసులేస్తూ అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అదే వైఖరిని కొనసాగిస్తుండడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా పాలమూ రు ప్రాజెక్టు గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. బీఆర్ఎస్ హ యాంలో 90 శాతంవరకు పనులు పూర్తి కాగా.. మిగిలిన పది శాతం పనులు పూర్తైతే జిల్లాలోని సుమారు 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆశ పడిన జిల్లా రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికొట్టుతున్నది. రెండేండ్లు దాటినా ఇప్పటివరకు ప్రా జెక్టుకూ రూపాయీ కేటాయించకపోవడంతోపాటు తట్టెడు మట్టి కూడా తీయకుండా చివరకు ప్రాజెక్టు సామర్థ్యాన్నే సగానికి తగ్గిస్తూ రైతాంగానికి ధోకా చేస్తున్నది.
90 టీఎంసీల సామర్థ్యంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు పాలమూరు, నల్లగొండ జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తే రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 45 టీఎంసీలకు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించడంపై జిల్లాలోని రైతులతోపాటు మేధావులు కాంగ్రెస్ ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 45 టీఎంసీలకు తగ్గిస్తే జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు కూడా సాగు నీరందించడం కష్టమేనని వారు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టి కేవలం కొడంగల్ సెగ్మెంట్‌కే సాగునీరివ్వడంపై దృష్టి సారించి జిల్లాలోని మిగతా పరిగి, వికారాబాద్, తాండూరు సెగ్మెంట్లను నిర్లక్ష్యం చేస్తుండడంపై రైతాంగం భగ్గుమంటున్నారు.
90 శాతం పూర్తైన పనులు..
ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు గత బీఆర్ఎస్ హయాంలో 90 శాతం వరకు పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు నార్లాపూర్ రిజర్వాయర్ లిఫ్ట్-1 వద్ద వెట్న్‌న్రు అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బీడులు బారిన ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లకు సాగునీరందించి ప్రజల ఏండ్ల కలను నెరవేర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి రూ.27 వేల కోట్లను ఖర్చు చేసింది.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగా..సాగునీరందించేందుకు కాల్వల నిర్మాణ పనులు మాత్రమే చేయాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించిన నిధులనూ గత కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాదిలోగా సాగునీరొస్తుందని ఆశతో ఎదురుచూసిన జిల్లా రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరాశే మిగిలింది. వికారాబాద్ జిల్లాకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగు, తాగు నీరందించేలా గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలోని సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరందడంతోపాటు 998 హబిటేషన్లకు తాగునీరందించేలా ప్రణాళికను రూపొందించారు. గత కేసీఆర్ ప్రభుత్వం కాల్వల ద్వారా కృష్ణా జలాలతో జిల్లాలోని దాదాపు 1000 చెరువులను నీటితో నింపేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిన విషయం తెలిసిందే.

సరిపడా నిధులున్నా.. సాగని పనులు
రంగారెడ్డి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) :ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులు, ప్రజలకు జీవధారమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టింది. ఈ ప్రాజెక్టు పూ ర్తైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వేలా ది ఎకరాలకు సాగుతోపాటు తాగునీరు అందే అవకాశాలున్నాయి. ఇందుకోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకానికి రూ.35,000 విడుదల చేసింది. ఆ నిధుల నుంచి 27,500 కోట్లతో దాదాపుగా 90 శాతం పనులను పూర్తి చేసిం ది. కాల్వల తవ్వకాలు వంటి పనులు మిగిలి ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నది. సరిపడా నిధులున్నా ఆ పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సర్కార్ నిర్లక్ష్యంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
లబ్ధిపొందే మండలాలు..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తలకొండపల్లి, మాడ్గుల, ఆమనగల్లు, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, తాండూరు, పరిగి తదితర మం డలాల్లో సుమారు 1.20 లక్షల ఎకరాలకు పైగా పంట పొలాలకు సాగుతోపా టు తాగునీరు అందే అవకాశాలున్నా యి. ఈ ప్రాజెక్టు పూర్తైతే తమ భూము లు సస్యశ్యామలమవుతాయని రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పైన పేర్కొన్న నియోజకవర్గాల్లో శాశ్వత సాగు నీటి వసతి లేకపోవడంతో అన్నదాతలు వర్షాభావ పంటలపైనే ఆధారపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే వారి కి శాశ్వతంగా సాగునీరు అందుతుంది.
టీఎంసీలను తగ్గించేందుకు కుట్ర..
పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీరు అవసరమని గత కేసీఆర్ ప్రభుత్వంలోనే డీపీఆర్‌లో పొందుపర్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 టీఎంసీలకు తగ్గించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రకు తెరలేపాయి. 90 టీఎంసీల నీటిని కోరుతూ తయారుచేసిన డీపీఆర్‌ను మోదీ ప్రభుత్వం వెనక్కి పంపడం రైతులను కించపర్చడమోనని అన్నదాత లు మండిపడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు శాశ్వత సాగునీరు అందించేందుకు 90 టీఎంసీల నీటిని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పాలమూరును పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందనే..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. గత కేసీఆర్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పది శాతం పనులను పూర్తి చేసే ఉద్దేశం రేవంత్ సర్కార్‌కు లేదు. కావాలనే ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నది. రైతులకు మంచి చేసే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు. ఈ ప్రాజెక్టు పూర్తైతే కేసీఆర్‌కు పేరొస్తుందన్న కుట్రతోనే కాల్వల పనులను చేపట్టడం లేదు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం.
-ఇస్మాయిల్, మిట్టబాసుపల్లి, తాండూరు రూరల్
నీటి సామర్థ్యాన్ని కుదించొద్దు..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కుదించే యోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. రేవంత్ సర్కార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కావాలనే అన్యా యం చేస్తున్నది. ఈ విధానం మంచిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేసి అన్నదాతలకు మేలు చేయాలి. లేకుంటే మరో ఉద్యమం తప్పదు.
– సత్యయ్య, వ్యవసాయ కార్మిక సంఘం, దోమ మండల అధ్యక్షుడు
పాలమూరును త్వరగా పూర్తి చేయాలి
కృష్ణా నది జల వివాదాన్ని వెంటనే పరిష్కరించాలి. రాజకీయాల కారణంగా పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపొతల పథకం పను లు నెమ్మదిగా జరుగుతున్నాయి. సుమారు 12 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. పాలమూరు-రంగారెడ్డి పథకంతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాలకు సాగు, తాగునీటి అందుతుంది.
-నర్సింహులు, రిటైర్డ్ ఉద్యోగి, తాండూరు రూరల్
ప్రాజెక్టుపై ప్రజాప్రతినిధుల వివక్ష
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వివక్షకు గురవుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను గత కేసీఆర్ ప్రభుత్వం 90% వరకు పూర్తి చేయగా.. మిగిలిన పనులను చేపట్టడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నది. నిధులు సరిపడా ఉన్నా ఇప్పటికీ తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఈ పనులు పూర్తైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీటి కొరత తీరుతుంది.
-శ్రీనివాస్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫోరం జిల్లా అధ్యక్షుడు
సర్కార్ నిర్లక్ష్యం తగదు..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో శాశ్వతంగా సాగు, తాగు నీరందుతుం ది. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు శాశ్వతంగా సాగునీరు అందించాలన్న ఉద్దేశంతోనే గత కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నది. పనులు 90% పూర్తికాగా.. మిగిలిన పనులను పూర్తి చేయడంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధం
-సత్తు వెంకటరమణారెడ్డి, గ్రంథాలయ సంస్థ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్
సాగునీటి సౌకర్యం లేక..
నియోజకవర్గంలోని రైతులు వర్షాలపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. సాగునీటి వనరులు అంతంతే. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే ఈ ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం పెరుగుతుంది. అందుకోసం రైతు లు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని వెయ్యికండ్లతో ఎదు రుచూస్తున్నారు.
-వేణుగోపాల్, ఎస్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడంగల్
కొడంగల్ సస్యశ్యామలమవుతుంది
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తైతే కొడంగల్ నియోజకవర్గం పంటలతో కళకళలాడేది. ఈ ప్రాంత రైతులు వర్షాలపైనే ఆధారపడి పంటలను సాగుచేస్తున్నారు. ప్రాజెక్టు పనులు చివరి దశలో ఆగిపోవడం బాధాకరం. కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి ఉంటే.. ఇప్పటికే రైతులకు సాగు నీరు అందేది.
-నవాజుద్దీన్, కొడంగల్
రాజకీయాలు తగవు
రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు రైతుల ప్రయోజనాలకోసం పని చేయాలి. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చివరి దశకు చేరుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ మిగిలిన పనులను పూర్తి చేయాలి.
– ఎం.నాగయ్య, వికారాబాద్