క్షణాల్లో రిజిస్ట్రేషన్.. నిమిషాల్లో మ్యుటేషన్.. ఇది ధరణి ప్రత్యేకం.. ఇంత మంచి పోర్టల్‌ను తొలగించి.. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తే మళ్లీ దందాల రాజ్యం వస్తుందని, భూ సమస్యలు పెరుగుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చస్తున్నారు. కొందరు మళ్లీ పాత పద్ధతిని తీసుకొస్తామని చేస్తున్న ప్రకటనలు సరికాదన్నారు. తమ భూములు లాక్కోవాలని.. హక్కులు హరించాలని చూస్తే సహించేది లేదన్నారు. పహాణీ, ఆర్వోఆర్ నకలు పుట్టించి మా భూములపై బినామీలు రుణాలు తీసుకొని కష్టాల పాలు చేసిన వ్యవస్థ తమకొద్దంటున్నారు. గతంలో రెవెన్యూ అధికారులతో పడిన కష్టాలను గుర్తు చేసుకుంటున్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెబుతున్న ఓ పార్టీ నేతలపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆ పార్టీని నమ్మితే నిండా మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. పైరవీకారులు రాజ్యమేలుతారని, లంచావతారులు పుట్టుకొస్తారని, ఏ చిన్నపనికైనా అధికారులు ఏండ్ల తరబడి తిప్పుకుంటారని వాపోతున్నారు. రికార్డులు తారుమారు చేసి ఒకరికొకరికి మధ్య పంచాయితీలు పెడతారని మండిపడుతున్నారు. అలవిగాని హామీలతో తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా భూదందాలు సాగించేవారని, ‘ధరణి’ స్థానంలో మరో పోర్టల్‌ను తెచ్చి దోపిడీకి పాల్పడాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. భూముల ధరలు పతనం కావడంతో వ్యవసాయంపై ఆధారపడ్డ అనేక రంగాలు సైతం కుంటు పడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ హక్కుల కోసం గతంలో పడ్డ ఇబ్బందులు ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నాయని, ఈసారి ఎన్నికల్లో అర్హత లేని పార్టీకి డిపాజిట్ దక్కనివ్వకుండా తరిమికొడతామని శపథం చేస్తున్నారు. ధరణిని రద్దు చేయడం కాదు..తామే అర్హతలేని పార్టీని రద్దు చేస్తామని బాజప్తా చెబుతున్నారు.
‘ధరణి’తోనే అక్రమాలకు అడ్డుకట్ట..
తెలంగాణ ప్రభుత్వం ‘ధరణి’ అమలు చేశాకే భూముల విషయంలో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. రైతులకు భరోసా ఏర్పడడంతో పాటు భూముల ధరలు పెరిగినయ్.. అమ్మినా, కొన్నా సులువుగా రిజిస్ట్రేషన్లు, నిమిషాల్లోనే పట్టాదారు పాసు పుస్తకం చేతికి వస్తున్నయ్. చీటికిమాటికీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది.
– తోట గిరియాదవ్, ఆమనగల్లు మున్సిపాలిటీ
పాత పద్ధతి వస్తే కష్టమే..
‘ధరణి’ని రద్దు చేసి పాత పద్ధతి వస్తే, మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరుగాల్సి వస్తది. పటేల్, పట్వారీ వ్యవస్థతో అవస్థలు పడ్డం. ధరణితో సమస్యలు తొలిగాయి. వేరే పోర్టల్‌ను తీసుకొస్తే దళారుల రాజ్యమే వస్తది. పట్టదారు పుస్తకాలు, మ్యుటేషన్ అంటూ నానా బాధలు పడాలి. అధికారులు సైతం చేతివాటం ప్రదర్శిస్తరు.
– దావ గిరిధర్, సంకటోనిపల్లి గ్రామం, ఆమనగల్లు మున్సిపాలిటీ
అర్హతలేని పార్టీని నమ్మితే ఆగమే..
‘ధరణి’ని రద్దు చేసి వేరే పోర్టల్‌ను తీసుకొస్తామంటున్న అర్హత లేని పార్టీని నమ్మితే రైతులు ఆగమైతరు. ధరణి లేకముందు అనుభవించిన కష్టాలు గుర్తు చేసుకుంటే కన్నీళ్లు వస్తయ్. ఇంటిపేరు తప్పు, సర్వే నంబర్లు తప్పు ఇలా వీటిని సరి చేసుకోవాలంటే ఏండ్లకొద్దీ తిరిగేది. ధరణి వచ్చాకే అన్ని పనులు సులువైనయ్.
– మంగలి వెంకటేశ్ (చేవెళ్లటౌన్)
పాత పద్ధతొద్దు.. ఆ పట్వారీ వ్యవస్థ వద్దు..
అర్హతలేనోళ్లు తీసుకొస్తామంటున్న కౌలుచట్టం.. ఆ పాత పద్ధతొద్దు.. పట్వారీ వ్యవస్థ అసలే వద్దు.. చెప్పులరిగేలా తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరిగేది. పంట నష్టం రాయాలన్నా, బ్యాంక్ లోన్ ఇవ్వాలన్నా, భూ రికార్డులు కావాలన్నా పైసలియ్యనిదే పని కాకపోయేది. ధరణి వచ్చాకే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పాసుబుక్‌లు ఇబ్బంది లేకుండా వస్తున్నయ్.
– ఇస్లావత్ ధర్మానాయక్, టాక్‌రాజ్‌గూడ (కడ్తాల్)
కౌలు చట్టంతో ఇబ్బందులే..
కౌలు చట్టం తెస్తే పట్టాదారులకు ఇబ్బందులే. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి.. రైతుల్లో ధైర్యాన్ని నింపింది. తెలంగాణ రాకముందు భూ రికార్డులన్నీ గందరగోళంగా ఉండేవి. గ్రామాల్లో నిత్యం భూములకు సంబంధించిన గొడవలు జరిగేవి. తహసీల్దార్ కార్యాలయాలన్ని పైరవీకారులతో నిండిపోయేవి. పహాణీ పేపర్లు కావాలన్నా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా దళారులదే రాజ్యంగా ఉండేది.
-గంప వెంకటేశ్‌గుప్తా (కడ్తాల్)
‘ధరణి’ని రద్దు చేస్తే మళ్లీ కష్టాలే..
‘ధరణి’ని రద్దు చేస్తే అన్నదాతలకు మళ్లీ కష్టాలే.. దళారులు, అధికారులకు దండం పెట్టుకుంటా తిరుగాలె. రాజకీయం లబ్ధి కోసం ధరణిని తీసి వేయవద్దు. మాయదారి మాటలను నమ్మితే పాత పద్ధతులతో పెత్తందారుల రాజ్యం వస్తది. కల్లబొల్లి మాటలు మాట్లాడే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు.
– దేవిడి విజయ్‌భాస్కర్‌రెడ్డి, తట్టిఅన్నారం, పెద్దఅంబర్‌పేట
లంచాలు ఇస్తేనే పని అయితది..
‘ధరణి’ని తీసేసి పాత పద్ధతి తీసుకొస్తే మళ్లీ దళారుల రాజ్యమొస్తది. పటేలు, పట్వారీ, దళారులు, అధికారులు.. ఇలా అందరికీ లంచాలు ఇస్తేనే భూముల పనులు అవుతయ్. లేకపోతే ఏండ్ల తరబడి తిరుగాల్సి వస్తది. పాతకాలం రికార్డుల ప్రకారం బలమున్నవాడిదే భూమి అన్నట్లు ఉండేది. ధరణి పోతే కష్టం.
– కెప్టెన్ అంజన్ గౌడ్, అంతారం గ్రామం (చేవెళ్ల రూరల్)
రైతులను మోసం చేస్తే పుట్టగతులు ఉండవు..
వేరే పోర్టల్‌తో రైతులను మోసం చేయాలని చూస్తున్న ఓ పార్టీకి పుట్టగతులు ఉండవు. ధరణి లేనప్పుడు ఎన్ని అవస్థలు పడ్డామో.. గుర్తు చేసుకుంటేనే గుండె గుబుళ్లుమంటున్నది. ధరణితోనే భూ సమస్యలు పరిష్కారమయ్యాయి.
– మోహన్‌రెడ్డి, బ్రహ్మణపల్లి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ
‘ధరణి’తోనే రైతుకు భరోసా..
‘ధరణి’ వచ్చాకే రైతుకు భరోసా వచ్చింది. అరగంటలో భూమి రిజిస్ట్రేషన్, వీలైనంత త్వరగా పాసు పుస్తకాలు చేతికొస్తున్నాయి. ఏ సమస్య ఉన్నా మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. పటేల్, పట్వారీ వ్యవస్థతో గోస పడ్డది చాలు. మళ్లీ ఆ బాధలు పడలేము. గతంలో పడిన బాధలను మరువం. ఇప్పుడు లేనిపోని మాటలు చెబితే నమ్మం.
– గూడూరు సుధాకర్‌రెడ్డి, బోడంపహాడ్(షాబాద్)
‘ధరణి’ని తీసేస్తే లంచాల బాధ తప్పదు..
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ చాలా బాగుంది. ధరణి పోర్టల్ ద్వారా అరగంటలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వారం రోజుల్లోనే పాస్ బుక్ ఇంటికి వస్తుంది. ఎకడా ఒక రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం వేలిముద్ర వేస్తేనే పోర్టల్ ఓపెన్ అవుతుంది. ధరణిని తీసేస్తే మళ్లీ లంచాల బాధ తప్పదు.
– ఏనుగు తిరుమల్‌రెడ్డి, బ్రహ్మణపల్లి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ