బొంరాస్పేట, మార్చి 5 : పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి టెన్త్ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారికి సాయంత్రం పూట అల్పాహారాన్ని అందిస్తుంది. మారిన పరీక్షల విధానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడానికి ఏటా ఒకేసారి నిర్వహించే ప్రీ-ఫైనల్ పరీక్షలను ఈ ఏడాది రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఎస్సెస్సీ వార్షిక పరీక్షలంటేనే విద్యార్థులకు కొంత భయం, ఒత్తిడి ఉంటుంది. ఆ భయాన్ని, ఒత్తిడిని దూరం చేయడానికి విద్యాశాఖ అభ్యాస దీపికలను రూపొందించి పంపిణీ చేసింది.
వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకునేలా నిపుణులైన ఉపాధ్యాయులతో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియంలో వీటిని తయారు చేశారు. గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, సాంఘీకశాస్త్రం పాఠ్యాంశాలపై ప్రశ్నలు, బిట్లను అభ్యాస దీపికల్లో పొందుపర్చారు. జిల్లాకు చేరిన ఈ పుస్తకాలను ఇటీవలే జిల్లా కలెక్టర్ ఆవిష్కరించగా వాటిని జిల్లాలోని అన్ని మండలాలకు పంపిణీ చేశారు. ఎంఈవోల ఆధ్వర్యంలో వాటిని పాఠశాలలకు చేరవేసి టెన్త్ విద్యార్థులకు పంపిణీ చేశారు. అభ్యాస దీపికలు తమకు ఎంతో ఉపయోగపడుతాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి రాష్ట్ర విద్యాశాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా అభ్యాస దీపికలను రూపొందించింది. ఈసారి వార్షిక పరీక్షల్లో కొంత మార్పులు చేసిన ప్రభుత్వం ఆరు పేపర్లతో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, భయపడకుండా వారిని అన్ని విధాలుగా సంసిద్ధులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, సబ్జెక్టు నిపుణులతో అభ్యాస దీపికలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో రూపొందించింది. వీటిని వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారు. అభ్యాస దీపికలు అందుకున్న విద్యార్థులు ఇవి తమకు ఎంతో దోహదం చేస్తాయని హర్షం వ్యక్త చేశారు.
వికారాబాద్ జిల్లాలో 13,324 మంది ఎస్సెస్సీ విద్యార్థులు
జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 13,324 మంది విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 165 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదివే 6371 మంది, 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 512 మందికి, 18 కేజబీవీలలో చదివే 732 మందికి, 9 మాడల్ స్కూళ్లలో చదివే 844 మందికి, రెండు టీఆర్ఈఐఎస్ పాఠశాలల్లో చదివే 150 మంది విద్యార్థులు ఇలా మొత్తం 8609 మంది విద్యార్థులకు విద్యాశాఖ అభ్యాస దీపికలను పంపిణీ చేసింది. గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆయా శాఖల ద్వారా విద్యార్థులకు ఇప్పటికే స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు.
సులభంగా అర్థం చేసుకునేలా
ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాఠ్యాంశాల్లోని ప్రధాన భావాలను సులభతరం చేయడానికి అభ్యాస దీపికలు దోహదపడనున్నాయి. విద్యార్థులు స్వీయ అభ్యాసంతో అన్ని ముఖ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునేలా విద్యాశాఖ విద్యా ప్రమాణాలు పాటించి వీటిని రూపొందించింది. వార్షిక పరీక్షల్లో పాఠాల వారిగా ఎలాంటి ప్రశ్నలు, బిట్లు వచ్చే అవకాశం ఉందో వీటి ద్వారా విద్యార్థులు గ్రహించగలుగుతారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
టెన్త్ వార్షిక పరీక్షల కోసం ప్రభుత్వం రూపొందించిన అభ్యాస దీపికలు చాలా బాగున్నాయి. విద్యార్థులు వీటిని బాగా చదివి సద్వినియోగం చేసుకోవాలి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో నాలుగు సబ్జెక్టులకు రూపొందించిన వీటిని జిల్లాలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేశాం. మారిన ప్రశ్నా పత్రానికి అనుగుణంగా వీటిని తయారు చేశారు. పాఠాలలో ఉన్న వ్యాసరూప ప్రశ్నలు, బిట్లు, ఐచ్ఛిక ప్రశ్నలు అన్ని ఉన్నాయి. ప్రాక్టీస్ పేపర్లు కూడా ఇచ్చారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి మంచి మార్కులు సాధించాలి.
-రేణుకాదేవి, డీఈవో వికారాబాద్
అభ్యాస దీపికలు బాగున్నాయి
ప్రభుత్వం ఎస్సెస్సీ విద్యార్థుల కోసం అందజేసిన అభ్యాస దీపికలు చాలా బాగున్నాయి. వీటిని చదువకోవడం ద్వారా పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం కలుగుతుంది. వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు తేవడానికి బాగా చదువుతున్నాం. మాకోసం అభ్యాస దీపికలు తయారు చేసి పంపిణీ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-శివాని, 10వ తరగతి విద్యార్థిని చౌదర్పల్లి, బొంరాస్పేట
ఎక్కువ మార్కులకు దోహదం చేస్తాయి
ఎస్సెస్సీలో మంచి ఫలితాలు తీసుకురావడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు సందేహాలు నివృత్తి చేస్తున్నాం. తాజాగా విద్యాశాఖ రూపొందించిన అభ్యాస దీపికలు విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి దోహదం చేస్తాయి. వీటిని విద్యార్థులు బాగా సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాం.
-శ్రీహరిరెడ్డి, హెచ్ఎం చౌదర్పల్లి ఉన్నత పాఠశాల, బొంరాస్పేట