రంగారెడ్డి, జూలై 24 (నమసే ్తతెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో అతిపురాతనమైన రాచకాల్వ క్రమంగా కబ్జాదారుల చెరలో చిక్కుకుని విలవిలలాడుతున్నది. నైజాం కాలంలో 1872లో వర్షపునీరు వృథా కాకుండా గొలుసుకట్టు చెరువులను నింపడంతో పాటు ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు నీరందించే ప్రధాన ఉద్దేశంతో ఈ కాల్వలను అప్పటి నైజాం నవాబులు నిర్మించారు. షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామం నుంచి సుమారు 5 మండలాలను కలుపుతూ ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వరకు 85 కిలోమీటర్ల సుదీర్ఘ పొడవైన రాచకాల్వ ఎక్కడికక్కడే కబ్జాలకు గురై తన ప్రాభవాన్ని కోల్పోతున్నది. రాచకాల్వ నుంచి వచ్చే వర్షపునీటితో గొలుసుకట్టు చెరువులను నింపడంతో పాటు ఇబ్రహీంపట్నం పెద్దచెరువును నింపే సామర్థ్యం ఉన్నది. క్రమంగా రాచకాల్వ (ఫిరంగినాలా) ఎక్కడికక్కడే కబ్జాలకు గురికావడంతో చెరువులోకి నీరు రాక పెద్దచెరువు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది.
జిల్లా పరిధిలోని షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామం నుంచి ప్రారంభమైన రాచకాల్వ చేవెళ్ల, రాజేంద్రనగర్, శంషాబాద్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో విస్తరించి ఉన్నది. ఈ మండలాల్లో సుమారు 85 కిలోమీటర్ల పొడవునా 100 మీటర్ల వెడల్పుతో ఈ రాచకాల్వ ఉండేది. ఈ మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్దఎత్తున వెంచర్లు ఏర్పాటు చేయడానికి రాచకాల్వను చెరబట్టారు. రాచకాల్వ వెడల్పును పూడ్చివేసి కొన్నిచోట్ల ప్లాట్లుగా కూడా మార్చారు.
ముఖ్యంగా శంషాబాద్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని అనేక ప్రాంతాల్లో రాచకాల్వ ఆనవాళ్లు లేకుండా చేశారు. బాలాపూర్ మండలంలోని నాదర్గుల్, ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిబట్ల, మంగల్‌పల్లి, పటేల్‌గూడ తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కాల్వలను ఎక్కడికక్కడే పూడ్చివేసి ప్లాట్లుగా మార్చడంతోపాటు పలు చోట్ల కాల్వపై నిర్మాణాలు కూడా చేపట్టారు. దీంతో చెరువుల్లోకి నీరొచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయి.
రాచకాల్వపై అక్రమ నిర్మాణాలు
కొంతమంది రాచకాల్వపై నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నప్పటికీ పెద్దఎత్తున కాల్వను కబ్జాచేసి కట్టడాలు నిర్మించారు. దీంతో రాచకాల్వ నుంచి నీరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వర్షాకాలానికి ముందు రాచకాల్వను మరమ్మతు చేసి నీరు చెరువులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకునేవారు. క్రమంగా కాల్వ కబ్జాలకు గురికావడంతో వాటిని కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు రావడంతో వెనక్కి తగ్గుతున్నారు.
జిల్లాలో ప్రధాన గొలుసుకట్టు చెరువులను నింపడంతో పాటు ఇబ్రహీంపట్నం పెద్దచెరువును నింపడం కోసం 153 సంవత్సరాల క్రితం నిర్మించిన రాచకాల్వ (ఫిరంగినాలా) కనుమరుగయ్యే ప్రమాదమున్నది. ఈ కాల్వను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడికక్కడే ఆక్రమిస్తుండటంతో కాల్వ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కాల్వకు మరమ్మతులు చేసి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.