రంగారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో డబుల్బెడ్రూంలు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పారదర్శకంగా జరగాలని.. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వొద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్‌తో కలిసి ఆమె కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించిందని.. వాటి పంపిణీలో ఎలాంటి వివక్ష లేకుండా అర్హులకే అందించాలన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో 4 వేల ఇండ్లు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 5 వేల ఇండ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి.. వాటిలో 70శాతానికి పైగా పేదలకు పంపిణీ చేశామని, మిగిలిన వాటిని కూడా ఆలస్యం చేయకుండా అర్హులకు పంపిణీ చేయాలన్నారు. కాగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కాకుండా ఇందిరమ్మ కమిటీ సభ్యుల బంధువులకు అందుతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్ పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
నిధుల రద్దు సమంజసం కాదు..
గత బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని సబితారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్న చోట మాత్రమే నిధులు కేటాయించి బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్లకు ఇచ్చిన నిధులను పూర్తిగా రద్దు చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల హక్కుని వాటి అమలులో రాజకీయాలు తగదన్నారు.
ప్రభుత్వ పథకాలు అర్హులకే అందాలి
ప్రభుత్వ పథకాలు అర్హులకే అందాలి. అందులో ఎలాంటి అవకతవకలకు అవకాశమివ్వొద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా పేదలకు అన్యాయం చేస్తున్నది.కేసీఆర్ హయాంలో అర్హులకే డబుల్ బెడ్ రూం ఇండ్లు అందాయి.
– వాణీదేవి, ఎమ్మెల్సీ
అనర్హులకు అందలం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అనర్హులకు అందలం వేస్తున్నాయి. అర్హత కలిగిన వారికి న్యాయం చేయడంలేదు. కమిటీలు ఇష్టానుసారంగా అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నాయి.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే
అవకతవకలు జరిగితే సహించేది లేదు
డబుల్బెడ్రూం ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగితే సహించేదిలేదు. గతంలో డ్రా పద్ధతిలో అర్హులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయించాం. ఆ జాబితాల్లో మార్పులు, చేర్పులు చేసి అర్హుల పేర్లను తొలగిస్తే సహించేదిలేదు. అలాగే, గత కేసీఆర్ ప్రభుత్వం సెగ్మెంట్ల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు రద్దుచేయటం సమంజసం కాదు. ఆ నిధులను యథావిధిగా కొనసాగించాలి.
-అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే షాద్‌నగర్