బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతిపథంలో దూసుకెళ్లాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించాయి. పల్లెల విజయ సోపానాలు దేశంలోనే మార్మోగాయి. జాతీయ అవార్డులు వరుస కట్టాయి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో వాటి ముఖచిత్రమే మారిపోయింది. పారిశుధ్యం మెరుగుపడింది. ప్రకృతి వనాలతో పచ్చదనం విచ్చుకున్నది. సీసీ రోడ్లు డ్రెయినేజీలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులతో పల్లెటూరు సరికొత్త శోభను సంతరించుకున్నది.
– నవాబుపేట, డిసెంబర్ 5
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. మండల పరిధిలోని మాదారం ఇందుకు నిదర్శనం. గ్రామంలో స్థానికులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం ఏ మేరకు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించిందో అర్థమవుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితులు నేడు అసలు కనిపించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, చెత్తాచెదారంతో కూడిన అపరిశుభ్రతతో దుర్వాసన వెదజల్లుతుందని ఆవేదన చెందుతున్నారు.
మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ సీఎం కాగానే గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఎంతో మెరుగ్గా ఉన్న గ్రామం నేడు అధ్వానంగా మారిందంటున్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోయిన గ్రామంలో నేడు నిధులు లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని చెబుతున్నారు. పల్లెప్రకృతివనం, నర్సరీ, క్రీడా ప్రాంగణం తదితర వాటిని గ్రామస్తులు మర్చిపోయారు. ఎస్సీ వాడలో మాత్రం మిషన్ భగీరథ నీరు ఇప్పటికీ రావడం లేదని తెలిపారు. బోరు నీరే దిక్కయిందని అన్నారు. గ్రామంలో సమస్యలు రాజ్యమేలుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో మురుగు రోడ్లపై పారుతుందని తెలిపారు. దీంతో దోమలు, ఈగలు వృద్ధి చెంది రోగాలకు నిలయంగా మారుతుందని పేర్కొన్నారు.
గ్రామంలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తీయడం లేదని చెప్పారు. వాటిని అప్పుడప్పుడు తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేసి కాలుస్తున్నారని, ఎరువును మాత్రం తయారు చేయడం లేదంటున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎరువును తయారు చేసి హరితహారం మొక్కలకు వేయడంతో అవి ఏపుగా పెరిగాయని తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగు అయిందని తెలిపారు. పశువుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన తొట్లెలు నిరుపయోగంగా మారాయి. కనీసం నీరు నింపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు కరువయ్యారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే అభివృద్ధి ఎలా అని పలువురు మండల అధికారులు పేర్కొనడం గమనార్హం.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామం అభివృద్ధి బాటలో దూసుకెళ్లింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అలాగే దిగజారుడు రాజకీయాన్ని ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఇప్పటి పరిస్థితులను చూస్త్తే దుఃఖం వస్తుంది. రైతులకు ఆయన చేసి మేలు ఎప్పటికీ మరిచిపోలేం. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించారు. గ్రామంలో తాగునీటి కష్టాలను దూరం చేశారు. ఇప్పుడు ఆ నీరే అందడం లేదు. మళ్లీ బోరు నీరే వాడుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన అప్పటి పనులను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఏదో చేస్తారని ఎన్నుకున్నారు. ఏమి చేయకపోవడంతో మళ్లీ నిరాశకు గురవుతున్నారు. మళ్లీ కేసీఆర్ పరిపాలన వచ్చే వరకు కూడా గిదే పరిస్థితి నెలకొంటుంది.
-ముష్టి వెంకటయ్య, గ్రామస్తుడు, మాదారం
గ్రామంలో సమస్యలు ఉన్న మాట వాస్తమే. నిధులు లేకపోవడంతో ఏమి చేయాలో తెలియడం లేదు. కొన్ని సందర్భాల్లో మా జీతాల నుంచి తీసి ఖర్చు చేస్తున్నాం. ఆ బిల్లులు ఇప్పటివరకు రాలేదు. గ్రామంలో చెత్తను సేకరించే ట్రాక్టర్‌కు డీజిల్ కూడా లేని సమయంలో సొంతంగా ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి. చెత్తను ఎప్పుటికప్పుడు తీయడం లేదని, దుర్వాసన వస్తుందని, పల్లె ప్రకృతి వనంలోకి మొక్కలు ఎండిపోతున్నాయని, తడి పొడి చెత్తతో ఎరువును తయారు చేయడం లేదని, కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే ఏ పని చేయడానికైనా నిధులు కావాలి. పంచాయతీలకు ఎన్నికల తర్వాత మళ్లీ నిధులు విడుదల అవుతాయని తెలిపారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు లేకపోవడంతో ఆ భారమంతా మా మీద పడిందని తెలిపారు.
– విశ్వనాథం, పంచాయతీ కార్యదర్శి, మాదారం