తాండూరు, జనవరి 25 : నియోజకవర్గంలో వేల సంఖ్యలో కార్మికులు, కూలీలకు జీవనాధారంగా ఉన్న నాపరాళ్ల పరిశ్రమ ప్రభుత్వం తీరుతో విలవిల్లాడుతున్నది. గత మూడు నెలలుగా ఈ పరిశ్రమలకు కొత్త కరెంట్ బిల్లుల నమోదు విధానాన్ని అనుసరిస్తుండడంతో బిల్లులు తడిసి మోపెడు అవుతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపుగా 500 వరకు నాపరాళ్ల క్వారీలుండగా వాటిలో నిత్యం వేలాది క్యుబిక్ ఫీట్ల నాపరాళ్లను వెలికి తీస్తుండడంతో 1,000 వరకు పాలిషింగ్ యూనిట్లు ఏర్పా టయ్యాయి.
ఈ పరిశ్రమకు భవన నిర్మాణ రంగంలో కొత్తగా వచ్చిన టైల్స్, మార్బుల్స్, గ్రానైట్ వంటి వాటితో పోటీ అధికంగా ఉన్నది. అయినా పరిశ్రమలను వృథాగా ఉంచలేక నియోజకవర్గంలో దాదాపు 700 యూనిట్లలో పనులు కొనసాగిస్తున్నారు. నాపరాళ్లలో డింగ్, క్వారీల్లో వెలికితీత, రవాణా వంటి పనుల ద్వారా 10 వేల మందికిపైగా కార్మికులు, లారీల యజమానులు, కూలీలు ఉపాధి పొందుతున్నారు. గత నవంబర్ 2025 నుంచి నాపరాళ్ల పరిశ్రమలకు కేవీఆర్హెచ్ విధానం ద్వారా కరెంట్ బిల్లులను నమోదు చేస్తున్నా రు. గతంలో కేడబ్ల్యూహెచ్ విధానాన్ని అనుసరించేవారు.
మూడు నెలలుగా సెగ్మెంట్లో పని చేస్తున్న దాదాపు 700 పాలిషింగ్ యూనిట్లలో 500 వరకు పరిశ్రమలకు కరెంటు బిల్లుల నమోదుకు మీటర్లలో ఆటోమెటిక్ టవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్ సిస్టమ్‌ను అమర్చారు. దీంతో ఒక్కసారిగా బిల్లులు రెండింతలు, మూడింతలు అధికంగా వస్తుండడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం.. తాము డిస్కం నిబంధనల మేరకే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెబుతుండగా..పాత విధానం ద్వారానే కరెంట్ బిల్లులను నమోదు చేయాలని వ్యాపారు లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొంటున్నారు. కెపాసిటర్లను తక్కువగా పెట్టుకుంటే బిల్లులు తక్కువగా వస్తాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.
సబ్సిడీలు ఇస్తేనే బిల్లులు తగ్గుతాయి
చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం, విద్యుత్తు శాఖ మంత్రి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ తీసుకునే నిర్ణయం బట్టి బిల్లుల పెంపా..? తగ్గింపా..? ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం సబ్సిడీలు, మినహాయింపు ఇస్తేనే బిల్లులు తగ్గుతాయి. కొత్త విధానంలో బిల్లుల వసూలుకు మీటర్లలో అమర్చుతున్న సాఫ్ట్వేర్ పనులు నియోజకవర్గంలో పూర్తైతే..అప్పుడు ఈ బిల్లుల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి డిస్కం బిల్లుల మినహాయింపు ఉంటుంది.
-రవిప్రసాద్, వికారాబాద్ జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈ
రెట్టింపు బిల్లు వచ్చింది
30 ఏండ్లుగా నాపరాళ్ల పరిశ్రమలో కొనసాగుతున్నా. గత ఐదేండ్లుగా నాపరాళ్లకు మార్కెట్ లేదు. చదరపు అడుగుకు రూ. 20కి మించి ధర లేదు. పాలిషింగ్ రాళ్లకు, రఫ్ రాళ్లకు మధ్య వ్యత్యాసం చాలా వరకు తగ్గడంతో కొత్తగా నాపరాళ్ల పాలిషింగ్ పరిశ్రమలను ఎవ రూ ఏర్పాటు చేయడంలేదు. ఇలాంటి పరిస్థితిలో కరెంట్ బిల్లులు మమ్మల్ని అయోమ యానికి గురి చేస్తున్నాయి. గతంలో నెలకు రూ.18 వేల వరకు వచ్చే బిల్లు ప్రస్తుతం నెలకు రూ. 36 వేలకు మించి వస్తున్నది. ఇలాంటి పరిస్థితి ఉంటే పరిశ్రమ కొనసాగడం గగనమే.
-మునీర్ పటేల్, వ్యాపారి, తాండూరు
రెండు నెలలకే రూ. 2.27 లక్షల బిల్లు వచ్చింది
పదేండ్లకు పైగా నాపరాళ్ల పరిశ్రమను నడుపుతున్నా. గత మూడు నెలలుగా విధిస్తున్న కరెంట్ బిల్లులతో ఆ పరిశ్రమను మూసేసే పరిస్థితి నెలకొన్నది. నేను ఏర్పాటు చేసిన హైపాలిషింగ్ యూనిట్లో ఐదు పాలిషింగ్, రెండు కటింగ్ మిషన్లు ఉన్నాయి. గతంలో నెలకు రూ. 18 నుంచి 20 వేల వరకు విద్యుత్తు బిల్లు వచ్చేది. గత మూడు నెలలుగా మూడింతల బిల్లులు వస్తున్నాయి. 224300470 నంబర్ కల మీటర్‌కు డిసెంబర్లో రూ. 59,827 బిల్లు వస్తే జనవరిలో రూ.1,68,581 వచ్చింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని అధికారులు బిల్లులు పంపారు. ఇంత మొత్తం కరెంట్ బిల్లులకే చెల్లిస్తే కార్మికులు, మెటీరియల్‌కు డబ్బులను ఎక్కడి నుంచి తీసుకురావాలి.
-అబ్దుల్ రషీద్, నాపరాళ్ల వ్యాపారి తాండూరు