వికారాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియను నిలిపివేశారు. పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు పత్తి కొనుగోళ్ల బంద్‌కు సోమవారం నుంచి పిలుపునిచ్చారు. ఇప్పటికే పత్తిని ఏరి విక్రయించేందుకు సిద్ధం చేసిన పత్తి రైతులు కొనుగోళ్లకు బ్రేక్ పడడతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాటన్ మిల్లర్ల అసోసియేషన్ ప్రకటించిన నిరవధిక సమ్మె ఎప్పటివరకు కొనసాగుతుందనేది స్పష్టత లేకపోవడంతో పత్తిని విక్రయించేందుకు సిద్ధం చేసిన అన్నదాతలు అయోమయంలో పడిపోయారు. కాటన్ మిల్లర్ల అసోసియేషన్ నిరవధిక సమ్మె ప్రకటించిన దృష్ట్యా పత్తిని విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకున్న రైతులు జిన్నింగ్ మిల్లుల వద్దకు పత్తిని తీసుకువచ్చి రెండు, మూడు రోజులు పడిగాపులు గాచిన అనంతరం సంబంధిత అధికారులు, మిల్లర్లు ప్రకటనతో ఏమీ చేయలేక కొందరు ఇంటికి తీసుకెళ్లగా, మరికొందరు ప్రైవేట్ మార్కెట్లో తక్కువ ధరకు పత్తిని విక్రయించి నష్టపోయారు.
కొనుగోళ్లలో గోల్మాల్ చేసేందుకే..
నిరవధిక సమ్మె నేపథ్యంలో తెచ్చిన అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరుగుతుండటంతో కొందరు రైతులు అప్పులు ఇచ్చినవారికే పత్తిని విక్రయిస్తుండగా, మరికొందరు ప్రైవేట్ మార్కెట్‌కు పత్తిని తరలిస్తున్నారు. సీసీఐ అందజేసే మద్దతు ధర కంటే ప్రైవేట్ మార్కెట్లో పత్తి క్వింటాలుకు రూ.2 వేలకుపైగా తక్కువగా ఉన్నప్పటికీ అన్నదాతలు పత్తిని అమ్మేస్తూ నష్టపోతున్నారు. వానకాలం సీజన్లో తుపానుల ప్రభావంతో పత్తి పంటను నష్టపోయిన రైతులు.. సీసీఐ పెట్టిన కొర్రీలతోపాటు కాటన్ మిల్లర్ల అసోసియేషన్ నిరవధిక సమ్మె ప్రకటించడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
అన్నదాతల మేలు కోసమేనంటూ నిరవధిక సమ్మెను ప్రకటించామని జిన్నింగ్ మిల్లర్లు చెబుతున్నప్పటికీ ప్రధానంగా మిల్లర్లకు నష్టం జరుగుతుందనే సమ్మెకు దిగినట్లు అభిప్రాయం వ్యకమవుతున్నది. ఎల్-1, ఎల్-2 నిబంధనను తీసుకువచ్చి ఒక్కో జిన్నింగ్ మిల్లు వారానికి 2500 మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధన తీసుకురావడంతోనే పత్తి కొనుగోళ్లను బంద్ చేస్తూ నిరవధిక సమ్మె ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఎల్-1, ఎల్-2 నిబంధనతో జిన్నింగ్ మిల్లుల యజమానులు ప్రైవేట్‌గా పత్తిని సేకరించినప్పటికీ సీసీఐ నిబంధనతో కొనుగోళ్లలో గోల్మాల్ చేసేందుకు వీలు లేకపోవడంతో సమ్మెకు దిగినట్లు తెలిసింది.