22ఏ నిషేధిత జాబితా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందాకు తెరలేపింది. 22ఏ సంక్షోభం నగరాన్నే కాదు వికారాబాద్ జిల్లాను కూడా కమ్మేసింది.దీంతో ప్లాట్ల యజమానులు చక్రబంధంలో చిక్కుకుపోయారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన భూ భారతి సమస్యలను పరిష్కరిస్తుందని అనుకుంటే నయవంచనకు గురిచేసిందని మండిపడుతున్నారు. 22ఏ నిషేధిత జాబితాలో ప్లాట్లను, ఇండ్లను, వ్యవసాయయేతర భూములను కూడా చేర్చడంతో సామాన్యులు, బడుగుజీవులు దిక్కుతోచని స్థితిలో విలవిలలాడిపోతున్నారు. ప్రజల సౌలభ్యం కోసమేనని నమ్మబలికిన కాంగ్రెస్ కమీషన్ల దందాకు తెరలేపింది.
భూములు అమ్మడం, కొనడం నిషేధం అంటూ పేదలను అయోమయానికి గురిచేస్తుంది. అప్పొ సప్పొ చేసి ప్లాట్లను కొనుగోలు చేసిన మధ్య తరగతి కుటుంబాలు లబోదిబోమంటున్నారు. 22ఏ నిషేధిత జాబితా పేరిట ఆడుతున్న నాటకంలో భాగంగా వారం రోజులుగా సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. వికారాబాద్ జిల్లాతో పాటు తాండూర్‌లో 77 ఎకరాల వ్యవసాయేతర భూములు, పరిగిలో 100 ఇండ్లను నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ లే అవుట్లను, ప్లాట్లను 22 ఏ జాబితా నుంచి తొలగించాలంటూ కలెక్టర్,ఎస్ఆర్వో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– వికారాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ (భూములు అమ్మడం, కొనడం నిషేధం) పేరిట భూదందాకు తెరలేపింది. అప్పులు చేసి కొన్నేండ్ల కిందట వ్యవసాయ భూములను కొని.. ప్రభుత్వానికి రూ.లక్షల్లో రుసుమును చెల్లించి వ్యవసాయేతర భూముల కిందకు మార్చి డీటీసీపీ లేఅవుట్లను ఏర్పాటు చేస్తే.. ప్రస్తుతం సర్కార్ వాటిని నిషేధిత జాబితాలో చేర్చడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రెవెన్యూ అధికారులను ఆరా తీస్తే.. వ్యవసాయేతర భూములుగా మారి, ప్లాట్లు, ఇండ్లు నిర్మించుకున్నా.. వ్యవసాయ భూముల కింద కూడా రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలుండడంతో ఇకపై వ్యవసాయేతర భూములుగా మారిన లేఅవుట్లు, ప్లాట్లు వ్యవసాయ భూముల కింద రిజిస్ట్రేషన్లు కాకుండా ప్రొహిబిటెడ్లో పెట్టినట్టు వెల్లడిస్తున్నారు.
ఇది ఏ మాత్రం వాస్తవం కాదని, తమ తప్పును కప్పిపుచ్చుకుంటున్నారని.. 22ఏను సాకు చూపి స్తూ పెద్ద ఎత్తున భూదందాకు తెరతీసినట్టు ఆరోపిస్తున్నారు. ఒకే సర్వేనంబర్‌లో నాలా కన్వర్షన్ పూర్తై లేఅవుట్లు కావడంతోపాటు వ్యవసాయ భూములూ ఉండడంతో కేవలం సంబంధిత సర్వేనంబర్ సబ్‌డివిజన్ నంబర్లను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చాల్సింది పోయి మొత్తం సర్వేనంబర్‌ను చేర్చినట్టు సమాచారం. సబ్రిజిస్ట్రార్లు అందినకాడికి దండుకుంటు న్నారని బాధితులు మండిపడుతున్నారు.
వికారాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గత వారం, పది రోజులుగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంతోపాటు తాండూరు, పరిగి పట్టణాల్లో అయితే మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు తప్ప ప్లాట్ల నమోదు ఒక్కటీ కావడంలేదు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని దాదాపు 35-40 లే అవుట్లతోపాటు పరిగి పట్టణంలోని ఒకట్రెండు లేఅవుట్లలోని 100 ఇండ్ల వరకు 22ఏలో చేర్చడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్తంభించింది. జిల్లా కేంద్రం లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో 25-30 రిజిస్ట్రేషన్లు కాగా, డీటీసీపీ అప్రూవుడ్ లే అవుట్లను నిషేధిత (ప్రొహిబిటెడ్) జాబితాలో చేర్చారని అధికారులు రిజిస్ట్రేషన్లను నిలిపే శారు.
కాగా, ఆ జాబితాలో చేర్చిన 35-40 లే అవుట్లలోని మెజార్టీ లేఅవుట్లలో ఇండ్ల నిర్మాణం పూర్తైంది. జిల్లా కేంద్రంలో 1983లో డీటీసీపీ లేఅవుట్ అయిన ఎన్జీవోకాలనీలోని ఇండ్లు, ప్లాట్లు.. అలాగే, తాండూరు పట్టణంలో 77 ఎకరాల్లో ఏర్పాటైన అప్రూవుడ్ లేఅవుట్లు, ప్లాట్లు, ఇండ్లను 22 ఏ జాబితాలో చేర్చారు. తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లిలోని సర్వేనంబర్ 45/2లోని 12 ఎకరాల నివాసస్థలాన్ని, సర్వేనంబర్ 111, 130లోని 36గుంటలు, సర్వేనం బర్-135లోని 41 ఎకరాల 31 గుంటలు, చెంగోల్, గౌతాపూర్ శివారు పరిధిలోని సర్వేనంబ ర్ 112, 141, 142, 143, 200, 212 సర్వేనంబర్లలోని 27 ఎకరాల వ్యవసాయేతర భూములను ప్రొహిబిటెడ్లో చేర్చారు.
మరోవైపు పరిగి పట్టణంలోనూ చాలావరకు ప్లాట్లు, ఇండ్లను 22ఏ జాబితాలో చేర్చినట్టు బాధితులు లబోదిబోమంటున్నారు. పరిగి సబ్‌రిజిస్ట్రార్( ఎస్ఆర్వో) పరిధిలో వంద ఇండ్ల వరకు 22ఏ జాబితాలో ఉన్నట్టు చెబుతున్నా.. చాలా ప్లాట్లు, ఇప్పటికే నిర్మించిన ఇండ్లు కూడా ఆ లిస్టులోనే చేర్చినట్టు సమాచారం. కాగా, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో జిల్లాలోని ఎస్ఆర్వో కార్యాలయాలు బోసిపోయాయి. మరోవైపు ఏండ్ల కిందటి డీటీసీపీ లే అవుట్లనూ 22ఏ జాబితాలో చేర్చడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమ లే అవుట్లు, ప్లాట్లను 22 ఏ జాబితా నుంచి తొలగించాలంటూ కలెక్టర్ మొదలుకొని ఎస్ఆర్వో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. గత పదిహేను రోజులుగా తమ ప్లాట్లను ప్రొహిబిటెడ్లో చేర్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
పక్కా ప్లాన్‌తోనే సర్కార్ వ్యవసాయేతర భూములైన లేఅవుట్లు, ప్లాట్లను 22ఏ జాబితాలో చేర్చిందనే అనుమానాలున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్ తదితర భూములకు సం బంధించి రిజిస్ట్రేషన్లు కాకుండా దాదాపు నెల రోజులపాటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేసి.. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్ తదితర భూములను 22ఏ జాబితాలో చేర్చినట్టు సమాచా రం. గతంలో సీలింగ్ భూములుగా ఉండి తదనంతరం డీటీసీపీ లే అవుట్లుగా మారిన వాటిని కూడా రెవెన్యూ అధికారులు 22ఏ జాబితాలో చేర్చారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు తాండూరు, పరిగి పట్టణాల్లో లేఅవుట్లుగా ఏర్పాటై, ఇండ్ల నిర్మాణం జరిగిందని రెవెన్యూ యం త్రాంగానికి తెలిసినా కావాలనే ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో చేర్చినట్టు ఆరోపణలున్నాయి. వ్యవసాయేతర భూముల నాలా కన్వర్షన్ అయినా 22ఏ జాబితాలో చేర్చడంపై ప్రజలు మండిపడుతున్నా రు. ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగించేందుకు దరఖాస్తుల ద్వారా రెవెన్యూ పొందేందుకు ప్రభుత్వం చేసిన పన్నాగమా..?
అని ప్రశ్నిస్తున్నారు.