తాండూరు, ఆగస్టు 18 : రణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ తీరు అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. మొదటి నుంచి మూడో విడుత వరకు రైతులకు సరైన సమాచారం లేక, మాఫీ వివరాలు తెలియక అన్నదాతలు అమోమయానికి గురవుతున్నారు. అదిగో చేశాం.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకోవడం తప్ప.. అర్హత ఉన్నా చేయలేదంటూ రైతులు భగ్గుమంటున్నారు.
తాండూరు నియోజకవర్గంలో బ్యాంకుల్లో సగానికిపైగా రైతులకు రుణమాఫీ కాలేదు. ఏ పల్లెకెళ్లి రైతులను పలుకరించినా కాంగ్రెస్‌పై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో రైతులందరికీ మాఫీ చేసి న్యాయం చేశారని గుర్తు చేసుకుంటున్నారు. పలువురు అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. తాండూరు మండలం గౌతాపూర్‌లో రుణమాఫీపై గందర గోళం నెలకొన్నది. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్ కేవలం రెండెకరాలే ఉండి రూ.90 వేలున్న మూడు విడుతలూ ముగిసినా రుణమాఫీ కాలేదని ప్రశాంత్ దేశ్‌పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో వందలాది మంది రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉన్నదన్నారు. పెద్దేముల్ మండలం బుద్దారంలో 242 మంది రైతులు మాఫీకి అర్హులు కాగా, ఇంకా రుణమాఫీ కాలేదని అనేక మంది రైతులు బోరుమంటున్నారు. రేగొండి వెంకటయ్యకు రూ.1.80 లక్షల రుణమాఫీ కావాల్సింది ఉండగా, ఎవరూ స్పందించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేస్తే మంచిదని, లేదంటే రాబోవు రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ హామీలు జూటా మాటలే..
రూ.2 లక్షల వరకు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పిన రేవంత్‌రెడ్డి మాటలు జూటానే. మూడు విడుతలు ముగిసినా నాకు బ్యాంకులో ఉన్న రుణం రూ.90 వేలు మాఫీ కాలేదు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. రుణమాఫీలో సరైన స్పష్టత లేక అనేక మంది రైతులు తికమక పడుతున్నారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మాలాంటి వాళ్లకు ఇలా జరిగేతే ఎలా ? ఇప్పటికైన సంబంధిత శాఖ అధికారులు రుణమాఫీ కాని రైతులను సంప్రదించి వెంటనే రుణాలు మాఫీ చేయాలి.
– ప్రశాంత్ దేశ్‌పాండే, గౌతాపూర్
ఎదురుచూపులే మిగిలాయి..
రుణమాఫీ కోసం ఆరునెలల నుంచి ఎదురుచూపులే మిగిలాయి. మూడు విడుతల్లోనూ రుణం మాఫీ కాలె. పెద్దేముల్ సొసైటీలో రూ.1.80 లక్షలు రుణం తీసుకున్నా. మూడో విడుతలో పేరు వస్తుందని ఆశతో ఎదురు చూశా. ఇంతవరకు రాకపోవడం బాధగా ఉన్నది. గత బీఆర్ఎస్ పాలనలో ఇలా జరుగలేదు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. రైతుల ఉసురుపోసుకున్న ఏ పార్టీ మనుగడ సాధించలేదు. ప్రజాపాలనంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
– రేగొండి వెంకటయ్య, బుద్దారం