అదిగో.. ఇదిగో రైతు భరోసా అంటూ రైతాంగాన్ని ఊరించిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు చెయ్యిచ్చింది. 11 విడతలుగా నిర్విఘ్నంగా కేసీఆర్ సర్కారు పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతుల్లో భరోసా నింపింది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క యాసంగిలోనే అంతంతగా సాయం అందించి చతికిలపడింది. వానకాలం ముగిసినప్పటికీ సాయం ఊసే లేకపోవడంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈసారి ప్రతికూల పరిస్థితుల్లో అరక సాగక.. సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా తగ్గింది. ప్రైవేటుగా అప్పులు తెచ్చి సాగుకు ఉపక్రమించడంతో రంగారెడ్డి జిల్లా రైతులపై దాదాపు రూ.165.84 కోట్ల భారం పడి ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
– రంగారెడ్డి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ)
సాగు తగ్గింది.. అప్పులు పెరిగాయి..
గత యాసంగిలో నెలకొన్న అనావృష్టి, కరెంటు కోతలతో నష్టపోయిన రైతులు వానకాలంలోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. అయితే వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే అందాల్సిన రైతు భరోసా సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో జిల్లా రైతాంగం పంటల సాగు విషయంలో డైలమాలో పడింది. కొందరు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలను సాగు చేశారు. మరికొందరు కొంతమేర పొలాలను బీళ్లుగా ఉంచి పంటల సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకున్నారు. గత రెండూ, మూడు నెలలుగా ఊరిస్తూ వచ్చిన సర్కారు వానకాలం సీజన్ ముగిసేనాటికి కూడా అందించలేకపోయింది.
మరికొద్ది రోజుల్లోనే పత్తి వంటి పంటలు సైతం చేతికందనున్నాయి. గత వానకాలంలో 3,47,989 ఎకరాల్లో వివిధ పంటలను జిల్లా రైతులు సాగు చేయగా.. ప్రస్తుతం 3,31,692 ఎకరాల్లోనే సాగు చేశారు. ఈ లెక్కన ఈసారి 16వేల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం తగ్గింది. పెట్టుబడి సాయం అందక.. ఈసారి పంటలను సాగు చేసిన జిల్లా రైతాంగం దాదాపు రూ.165.84 కోట్ల మేర ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చింది. అదే విధంగా వికారాబాద్ జిల్లాలో 4.08 లక్షల ఎకరాల్లో ఈ వానకాలం పంటలను సాగు చేశారు. గత వానకాలం సాగు కంటే ఈసారి సాగు విస్తీర్ణం తగ్గిందని వికారాబాద్ జిల్లాయంత్రాంగం పేర్కొన్నది. కాంగ్రెస్ సర్కారు అన్నదాతలపై చూపుతున్న నిర్లక్ష్యంతో జిల్లా రైతాంగం మండిపడుతున్నది.
కేసీఆర్ హయాంలో రూ.3,337 కోట్ల సాయం..
రైతులు పంట పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లకు ముందుగానే రైతు బంధు సాయాన్ని అందిస్తూ వచ్చింది. అప్పులు చేసే పరిస్థితులకు చరమగీతం పాడిన రైతు బంధు పథకానికి ప్రతి అన్నదాత కుటుంబం ఫిదా అయింది. 2018 వానకాలం సాగు నుంచి ఏటా రూ.8వేల సాయం అందించగా.. 2019 వానకాలం సీజన్ నుంచి సాయాన్ని రూ.10వేలకు పెంచారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ పెట్టుబడి సాయాన్ని ఆపలేదు.
రైతన్నలకు ఆత్మబంధువుగా నిలిచిన రైతు బంధు పథకంలో రంగారెడ్డి జిల్లాలోని రైతాంగానికి 11 విడతలుగా గత యేడాది వానకాలం సీజన్ వరకు రూ.3,337 కోట్లను నిరాటంకంగా అందించింది. ప్రతి సీజన్‌కు ముందుగానే కేసీఆర్ హయాంలో రైతు బంధు సాయం అందగా.. కాంగ్రెస్ హయాంలో సీజన్ ముగిసేనాటికి కూడా నయా పైసా రైతుల ఖాతాల్లో జమకాని దుస్థితి నెలకొన్నది. తొలకరి జల్లులు కురిసింది మొదలు.. దుక్కులు దున్నడం.. ఎరువులు.. విత్తనాలు.. కూలీల కోసం రైతులకు పెట్టుబడి ఖర్చులు ప్రతి సీజన్‌కు తడిసిమోపెడవుతుండగా.. ఇందుకోసం అయినకాడికి అప్పు చేసి సాగు బాట పట్టాల్సి వస్తున్నది.

ఇబ్బందులు పడుతున్నాం
రైతు భరోసాతో తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించాం. కాని సీజన్ అయిపోవస్తున్నా ఇప్పటివరకు నిధులను కేటాయించకపోవడంతో ఆందోళనకరంగా ఉన్నది. రైతు భరోసాను నమ్మి అప్పులు తీసుకువచ్చి పంటలు వేశాం. గత ప్రభుత్వం పంట ప్రారంభమయ్యేలోనే రైతు బంధు వేసేది. లాగోడికి ఇబ్బంది ఉండేది కాదు.
– గుండుమల్ల నర్సింహులు, రైతు, తిర్మలాపూర్, కులకచర్ల మండలం
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి
అన్నదాతలకు రైతు భరోసా పేరుతో పంటలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ఎన్నికల సమయంలో చెప్పి దాని జోలే ఎత్తడంలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. సాయం అందిస్తామని చెప్పి ఓట్లను దండుకొని మాట మరువడం విడ్డూరం. ఇప్పటికైనా సర్కారు రైతు భరోసాను ఇవ్వాలి.
– కుర్వ భిక్షపతి, నాగులపల్లి, పెద్దేముల్ మండలం
అప్పులు చేసి ఎరువులు, విత్తనాలు తీసుకున్నా
రైతు బంధు రాక అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు తీసుకొచ్చి పంటలు సాగు చేశా. గత కేసీఆర్ ప్రభుత్వంలో సాగు సమయానికి పెట్టుబడి డబ్బులు వచ్చేవి.
– రాంచంద్రయ్య, రావులపల్లి, మర్పల్లి మండలం
సాయం రాక అప్పులు చేశాం
ప్రతీసారి దుక్కులు దున్ని, విత్తనాలు విత్తేనాటికి పెట్టుబడి సాయం అందేది. ఈ ఏడాది పంట సాయం అందక అప్పులు చేశాం. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు కొన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తే కొంత అప్పు తీరుతుంది.
– గాలి రాజు, తొరుమామిడి, బంట్వారం మండలం
అప్పులు చేసే పరిస్థితి దాపురించింది..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండుసార్లు రైతు బంధు వచ్చేది. కాంగ్రెస్ సర్కారు వచ్చినంక అన్ని ఇబ్బందులే. అప్పులు చేసే పరిస్థితి దాపురించింది. యాసంగి వచ్చినప్పటికీ వర్షాకాలం పంటలసాగు పెట్టుబడి సాయం నేటికీ అందించకపోవటం సిగ్గుచేటు.
– మొగిలి వెంకటేశ్, ఇబ్రహీంపట్నంరూరల్
సీజన్ ముగిసినా డబ్బులు రాలే..
వానకాలం సీజన్ ముగిసినా రైతు భరోసా సాయం అందలేదు. బీఆర్ఎస్ పాలనలో సాగు కాలం ప్రారంభమవ్వగానే పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేసేది. ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని మరిచిపోయినట్టుంది. కేసీఆర్ పాలనలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడలేదు.
– రాములుయాదవ్, కడ్తాల్ మండలం
తక్కువ సాగు చేయాల్సి వస్తున్నది..
సీజన్ ముగిసినా రైతు భరోసా ఇవ్వడంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో సాయం అందేది. ఇప్పుడు సాయం అందక అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. దీంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం. ప్రజా ప్రభుత్వమని చెప్పే కాంగ్రెస్ సర్కారు ఎందుకు సకాలంలో సాయం చేయడంలేదో చెప్పాలి.
– ఇమ్రాన్, సింగప్పగూడ, చేవెళ్ల మండలం
రూ.40 వేలు అప్పు చేశాను..
వానకాలం పంటల సాగు కోసం రూ.40 వేలు అప్పు చేశాను. వరిపంటతో పాటు కూరగాయల పంట సాగు చేశాను. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేసేవాళ్లం. ప్రస్తుతం రైతు భరోసా వేయకపోవడంతో అప్పులు చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.
– పి.కుమార్‌యాదవ్, కుమ్మరిగూడ, షాబాద్ మండలం