వికారాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నది. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ఎన్నికల ముందు హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా రుణాలను మాఫీ చేస్తూ దగా చేస్తున్నది. అంతేకాకుండా రూ.లక్ష లోపు మాఫీ అవుతున్న రుణాలకు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుని అర్హులైన వేలాది మంది అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నది.
పట్టాదారు పాసుపుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుం టామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా ఆ విధానం అమలు కాకపోవడం గమనార్హం. కాగా జిల్లాలో రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ ప్రక్రియ చేపట్టడంతో కేవలం 46 వేల మంది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. అదే పట్టాదారు పాసుపుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లయితే సుమారు లక్షకుపైగా రైతులకు మేలు జరిగేది.
అయితే ఒక కుటుంబంలో నలుగురి పేరిట భూములుండి వేర్వేరుగా పట్టాదారు పాసుపుస్తకాలుంటే రేషన్‌కార్డు ఆధారంగా వీరందరినీ ఒకే యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుంటున్నారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉంటే పై మొత్తాన్ని వచ్చేనెల 15 లోపు చెల్లిస్తేనే మాఫీ వస్తుందని..లేకపోతే వర్తించదని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూసిన అన్నదాతలకు… రేవంత్‌రెడ్డి సర్కారు కొత్త నిబంధనల పేరుతో అప్పుల పాలు చేస్తున్నదని మండిపడుతున్నారు. గతంలో ఉన్న కేసీఆర్ సర్కారే రైతులను అన్ని విధాలా ఆదుకున్నదని గుర్తు చేసుకుంటున్నారు.
కార్యాలయాలు కిటకిట
రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ కాలేదంటూ వేలాది మంది అన్నదాతలు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం మొదలుకొని క్షేత్రస్థాయిలో ఏఈవోల వరకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రుణమాఫీ కాలేదంటూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం నిబంధనలు పెట్టి కొంతమందికే రుణమాఫీ చేస్తున్నదని మండిపడు తున్నా రు.
మా రుణాలను కూడా మాఫీ చేయాలని వేల సంఖ్యలో ఫిర్యాదు చేస్తున్నారు. రుణమాఫీ కాని రైతుల సంఖ్య అధిక మొత్తంలో ఉండడంతో కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలోని టెక్నికల్ సెక్షన్, మండల వ్యవసాయాధికారి కార్యాలయా ల్లో, క్షేత్రస్థాయిలో క్లస్టర్ల వారీగా ఏఈవోలు రుణమాఫీ కాని రైతుల విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు.
రెన్యూవల్ చేశా..
నేను మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో రూ. 54,000 క్రాప్ లోన్ తీసుకున్నా. ఏడాదికోసారి ఆ రుణాన్ని రెన్యూవల్ చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తున్నదని తెలిసి చాలా సంతోషించా. బ్యాంకుకు వెళ్లి అడిగితే మీ రుణం మాఫీ కాలేదని అధికారులు చెప్పారు. నేను అర్హుడిని అయినా ప్రభుత్వం నా అప్పును ఎందుకు మాఫీ చేయలేదో అర్థం కావడంలేదు.
– గోరేటి అంజయ్యయాదవ్, కడ్తాల్
అర్హులందరికీ రుణమాఫీ చేయాలి
నేను, 2019లో మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో రూ. 50,000 రుణం తీసుకున్నా. ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. నేను అర్హుడిని అయినా నాకు మాఫీ వర్తించలేదు. ప్రభుత్వం స్పందించి అందరికీ రుణమాఫీ చేయాలి.
– ఖదీర్, అంగడి చిట్టంపల్లి గ్రామం, పూడూరు
సర్కారు రైతులకు అన్యాయం చేస్తున్నది
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నది. అర్హులైన వారికి కూడా రూ. లక్షలోపు రుణాన్ని మాఫీ చేయడం లేదు. నేను గతేడాది బ్యాంకులో రూ.49 వేలు తీసుకున్నా. నా రుణం కూడా మాఫీ కాలేదు. కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికల ముందు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. అధికారంలోకి రాగానే అనేక కొర్రీలు, నిబంధనలు పెట్టి అన్నదాతలను ఆగం చేస్తున్నది.
– సీత లింగయ్య, ఆర్కపల్లి, మాడ్గుల
నేనూ అర్హురాలినే..అయినా మాఫీ కాలె..
నేను హస్నాబాద్‌లోని ఎస్బీహెచ్ నుంచి రూ.77000 అప్పు తీసుకున్నా. ప్రస్తుతం ప్రకటించిన రూ.లక్ష లోపు రుణ మాఫీలో నా పేరు రాలేదు. బ్యాంకు అధికారులకు అడిగితే మాకు తెలియదు ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితా ప్రకారమే రుణమాఫీ జరిగిందని చేతులు దలుపుకొంటున్నారు. వ్యవసాయాధికారులను అడిగితే మాకు తెలియదు బ్యాంకు అధికారులకే తెలుసని చెబుతున్నారు. మరి ఎవరినీ అడగాలి.. రుణమాఫీ ఏవిధంగా జరుగుతున్నది. రూ.లక్షలోపు రుణమాఫీకి నేను అర్హురాలినే. కానీ, నా అప్పు మాఫీ కాలేదు.
– మోసిన్బేగం, రైతు, హస్నాబాద్, కొడంగల్
అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదు
నేను, నా భార్య కలిసి హస్నాబాద్‌లోని ఎస్బీహెచ్లో రూ.65,500, రూ.25,000 చొప్పున రుణం తీసుకున్నాం. 23-07-2020లో ఆ రుణాలను రెన్యూవల్ కూడా చేశాం. మా ఇద్ద రి పేరున దాదాపుగా రూ.లక్షలోపే అప్పు ఉంటుంది. అయినా మా రు ణం మాఫీ కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన జాబితా లో మా పేర్లు రాలేదు. వ్యవసాయాధికారులను సంప్రదిస్తే బ్యాంకు అధికారులను అడుగుమంటున్నారు. వారిని సంప్రదిస్తే మాకు తెలియదు.. ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితా ప్రకారమే రుణమాఫీ జరుగుతున్నదని చెబుతున్నారు. మాకు అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదు.
-ఎరుకలి పెద్ద ఆశన్న , రైతు, హస్నాబాద్, కొడంగల్
ప్రభుత్వం గొప్పలు చెప్పడం ఆపాలి..
అసెంబ్లీ ఎన్నికల ముందు రూ.రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక షరతులు, మెలికలు పెడుతూ అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నది. నేను నందిగామ పీఏసీఎస్‌లో రూ.40 వేల వరకు క్రాప్ లోన్ తీసుకున్నా. రూ. లక్ష లోపు ఉన్నా ఆ రుణం మాఫీ కాలేదు. ప్రభుత్వం గొప్పలు చెప్పడం ఆపి రైతుల రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలి.
-రాంబాబు, పీఏసీఎస్ డైరెక్టర్ నందిగామ