ఆమనగల్లు, ఏప్రిల్ 23: పురపాలక సంఘం నలుగురి కో అప్షన్ సభ్యుల ఎన్నిక కొరకు ఈ నెల 8వ తేదీన కమిషనర్ శంకర్‌నాయక్ నోటిఫికేషన్ జారీ చేశారు. 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగగా నలుగురి కో అప్షన్ పదవుల కోసం పదమూడు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేడు (శుక్రవారం) సభ్యుల ఎన్నిక పురపాలక సంఘం కార్యాలయ సమావేశ మందిరంలో 11 గంటలకు జరుగుతుందని కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు బీఆర్ఎస్కు చెందిన ఏడు మంది కౌన్సిలర్లు రాము, ఆంజనేయులు యాదవ్, రమేశ్, జగన్, యశోదమ్మ, భాగ్యలో, పుల్లారెడ్డి అనూశలు సమావేశ మందిరంకు చేరుకున్నారు. బీజేపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాలేదు.
మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ 11: 30 గంటల సమయంలో పురపాలక సంఘం కార్యాలయానికి చేరుకుని సమావేశ మందిరానికి వెళ్లకుండా తన చాంబర్లో కూర్చున్నాడు. అంతకు ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన 10వ వార్డు విఠాయిపల్లికి కౌన్సిలర్ అనిత పురపాలక సంఘానికి చేరుకుని మున్సిపల్ సిబ్బంది కార్యాలయంలో కూర్చున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్‌తో పాటు ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నిల కొరకు ఉన్నారు. ఆ సమయం వరకు కాంగ్రెస్, బీజేపీకి చెందిన కౌన్సిలర్లు రాకపోవడంతో సరైన కోరం (8 మంది కౌన్పిలర్లు) లేనందున కో అప్షన్ సభ్యుల ఎన్నిక ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ తెలపడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు జోక్యం చేసుకుని మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, కౌన్సిలర్ అనిత కార్యాలయంలో ఉన్నారని ఎన్నిక నిర్వహించుటకు కావలిసిన కోరం ఉందని ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదని కమిషనర్‌తో వాదనకు దిగారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏడుగురు మున్సిపల్ చైర్మన్ చాంబర్ ముందు బైటాయించి ఎన్నిక నిర్వహించాలని నిరసన తెలిపారు. ఈ సమయంలోనే చైర్మన్ పత్యానాయక్ తన చాంబర్ నుండి బయటకు వెళ్లిపోయారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట కో అప్షన్ ఎన్నికకు హాజరుకావాలని వారికి ఇచ్చిన పత్రాలతో నిరసన తెలిపారు. అనంతరం 5వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము మాట్లాడుతూ బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయాని కో అప్షన్ ఎన్నిక ఉందని తెలిసి కూడా హాజరు కాకపోవడం సిగ్గు చేటన్నారు.
మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, కౌన్సిలర్ అనిత కార్యాలయానికి వచ్చిన సమావేశానికి రాకపోవటం ఏంటని వారు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనలేక బీజేపీ కాంగ్రె స్ పార్టీలు జతకట్టాయాని వారు మండిపడ్డారు. ఆమనగల్లు మున్సిపాలిటీ ప్రజలు జరుగుతున్న ప్రతి సంఘటనను గమనిస్తున్నారాని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పడం ఖాయమాన్నారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, అల్లాజీ, రఘు, సైదుల్గౌడ్, ఉన్నారు.