జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ముందు నుయ్యి…వెనుక గొయ్యిలా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తర బడిగా ట్రాక్టర్లు, వ్యాన్ల ద్వారా నిరీక్షిస్తున్నా పట్టించుకోని అధికారులు.. దళారుల వాహనాలు వస్తే మాత్రం నేరుగా కొంటున్నట్లు ఆరోపణలున్నాయి. కేంద్రాల వద్ద మూడు, నాలుగు రోజులపాటు నిరీక్షించడం సాధ్యం కాని అన్నదాతలు పత్తిని తమ ఇండ్లల్లోనే నిల్వ ఉంచుకుంటున్నారు. జిల్లాలో 15 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో కొన్ని మాత్రమే ప్రారంభం కాగా, పూర్తి స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ జరుగడం లేదు. చేవెళ్ల, సంఘీలో గతం లో ఏర్పాటు చేసిన కేంద్రాలు ఈసారి ఇప్పటికీ షురూ కాలేదు.
-రంగారెడ్డి, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ)
ఆరు వేల ఎకరాల్లో సాగు..
ఆమనగల్లు మండలంలో సుమారు ఆరువేల ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేశారు. వీరు తమ పంటను నల్లగొండ జిల్లా చింతపల్లి సమీపంలో ఉన్న కాటన్‌మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తారు. అదేవిధంగా మాడ్గుల మండలంలోని పలు గ్రామాల రైతులు కూడా ట్రాక్టర్లు, ఆటోలు, లారీల ద్వారా పత్తిని అక్కడికి తరలిస్తున్నారు. అక్కడి అధికారులు మాత్రం మూడు, నాలుగు రోజులు నిరీక్షించిన తర్వాతే పత్తిని కొంటున్నారని..అదే దళారులు తీసుకొచ్చిన పత్తిని మా త్రం నేరుగా కొనుగోలు చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే, ఆమనగల్లు, తలకొండపల్లి, పోలేపల్లి, ఆకుతోటపల్లిలలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని వాపోతున్నారు.
ఆసాముల పేర్లతో దళారుల అమ్మకాలు..
జిల్లాలో ఈ ఏడాది రైతులు 1.39 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేయగా.. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లో పత్తి వ్యాపారం చేసే దళారులు తమ అనుకూల ఆసాముల పాస్‌బుక్కులను చూపించి పత్తిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. వారు తీసుకొచ్చే పత్తికి తేమశాతం తక్కువ ఉన్నా మద్దతు ధర రూ.7,521 చెల్లిస్తున్నారని.. రైతులు తీసుకొచ్చిన పత్తిలో ఏదో ఒక సాకు చెప్పి, కొర్రీలు పెడుతూ రూ.7200 మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఇండ్లల్లోనే పత్తి నిల్వ..
జిల్లాలో అధిక శాతం మంది రైతులు తాము పండించిన పంటను ఇండ్లలోనే నిల్వచేసుకుంటున్నారు. పత్తికి గిట్టుబాటు ధర రాకపోగా.. విక్రయించడంతోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తడం, మరోవైపు మంచు కూడా విపరీతంగా కురుస్తుండడంతో తేమశాతంలో వ్యత్యాసాలు వస్తున్న నేపథ్యంలో రైతులు ఇండ్లలోనే నిల్వ ఉంచుకుంటున్నారు.