జిల్లాలోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో దళారులే రాజ్యమేలుతున్నారు. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై అన్యాయం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకుతోటపల్లి పత్తి కొనుగోలు కేంద్రం వద్ద వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీసీఐ అధికారులు వ్యాపారుల పత్తి వాహనాలను నేరుగా లోపలికి అనుమతించి కొనుగోలు చేస్తున్నారని, తమ వాహనాలను అనుమతించకపోవడంతో రోజుల తరబడి మిల్లుల వద్ద నిరీక్షించాల్సి వస్తున్నదని రైతులు భగ్గుమంటున్నారు. సీసీఐ అధికారులు వ్యాపారుల కొమ్ము కాయడం సరైన పద్ధతి కాదని మండిపడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి మద్దతు ధర రాకపోగా కొనుగోలు చేసేందుకు కూడా నిరాకరిస్తున్నారని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 28 (నమస్తేతెలంగాణ)
వరుస సెలవులు.. రైతుల ఆందోళనతో కొనుగోళ్లు..
ఈ వారంలో వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో వారం రోజులుగా పత్తి మిల్లుల వద్దే రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం క్రిస్మస్, గురువారం బాక్సింగ్‌డే సెలవులొచ్చాయి. గురువారం రాత్రి మాజీప్రధాని మృతి చెందడంతో ప్రభుత్వం శుక్రవారం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో గత రెండురోజులుగా మిల్లుల వద్దే పడిగాపులు కాస్తున్న రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో మధ్యాహ్నం నుంచి సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. వ్యాపారుల ట్రాక్టర్లు, లారీలను లోనికి అనుమతించి, తమ వాహనాలను పంపించకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. శని, ఆదివారాల్లో కూడా పత్తి కొనుగోలుకు అధికారులు బ్రేక్ ఇచ్చారు. సోమవారం కూడా అమావాస్య కావడంతో కొనుగోలు చేస్తారా.. లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించలేక కొందరు రైతులు అక్కడే వ్యాపారులకు పత్తిని అమ్ముతున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని ఆకుతోటపల్లి, ఔరుపల్లి, షాద్‌నగర్, చేవెళ్ల వంటి పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద ఈ పరిస్థితి నెలకొన్నదని రైతులు వాపోతున్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. సెలవు రోజుల్లోనూ మిల్లుల వద్ద ఉన్న వాహనాల్లోని పత్తిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతుల వద్దే పత్తిని కొనుగోలు చేయాలి..
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అప్పజెప్పి తీవ్రంగా నష్టపోతున్నాం. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారుల నుంచి కాకుండా నేరుగా రైతుల నుంచే పత్తిని కొనుగోలు చేయాలి. అధికారులు దళారులకు కొమ్ముకాస్తూ వారివద్ద కమీషన్లు తీసుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు. ప్రభుత్వం స్పందించి పత్తి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి.
– రాంలాల్‌నాయక్, మాడ్గుల
దళారుల కొమ్ముకాస్తున్న అధికారులు..
పత్తిని కొనుగోలు చేసేందుకు అధికారులు అనేక ఆంక్షలు విధిస్తున్నారు. దళారుల వాహనాలకు మాత్రం ఏ ఆంక్షలు లేకుండా నేరుగా అనుమతించడం బాధగా ఉన్నది. నాలుగైదు రోజులుగా సీసీఐ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్నా పట్టించుకునేవారే లేరు. వ్యాపారులు అగ్గవసగ్గువకు పత్తిని కొని మమ్మల్ని నిండా ముంచేటట్టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుని రైతులకు న్యాయం చేయాలి.
– బాలూ నాయక్, నాగిళ్ల