రంగారెడ్డి, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/షాబాద్ : రంగారెడ్డి జిల్లాలో 214 గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ప్రభంజనం సృష్టించింది. ఇదే స్పీడ్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, పీఏసీఏస్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఎన్ని మాయమాటలు చెప్పినా ఓటర్లంతా బీఆర్ఎస్కే జైకొట్టారు. గులాబీ పార్టీ విజయంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం ఏర్పడింది. ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారనే దానికి నిదర్శనంగా ఫలితాలు రావడంతో ఇక నుంచి రాబోయే ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతున్నది. జిల్లాలో బీసీలకు 92 పంచాయతీలు రిజర్వు కాగా, జనరల్ స్థానాల్లో కూడా బీసీలు 106 మంది గెలుపొందారు. మొత్తంగా 198 మంది బీసీలు గెలుపొందారు. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ నిలబెట్టుకోకపోవడంతో బీసీలు ఎక్కువగా బీఆర్ఎస్కు పట్టం కట్టారు.
బీఆర్ఎస్ హయంలో జరిగిన అభివృద్ధిని చూసి..
చేవెళ్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 21 మండలాల్లో మొత్తం 525 గ్రామపంచాయతీలకు 214 గ్రామపంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. కొన్ని గ్రామాల్లో వేలల్లో మెజార్టీ సాధించి బీఆర్ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. గత పదేండ్ల కాలంలో పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రామాలను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీలను ఎవరూ పట్టించుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. గ్రామాల్లో పల్లెప్రగతిలో చేపట్టిన పనులకు నిర్వహణ లేకుండా పోయింది. దీనికి తోడు రెండేండ్లుగా సర్పంచ్‌లు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలనతో గ్రామాలు అభివృద్ధి నోచుకోలేదు. గ్రామాల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు.
ఫ్యూచర్ సిటీ పరిధిలోనూ..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సత్తా చాటారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని 56 గ్రామపంచాయతీలకు అత్యధిక స్థానాలు బీఆర్ఎస్, బీజేపీలు కైవసం చేసుకున్నాయి. ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటవుతున్న బేగరికంచ, మీర్ఖాన్పేట్ తదితర గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం.
కంచుకోటగా..
పంచాయతీ ఎన్నికల మాదిరిగానే రాబోవు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, పీఏసీఏస్ తదితర ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కేసీఆర్‌కు అండగా నిలవాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు దక్కించుకుని ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మున్సిపాలిటీలు, పీఏసీఏస్ చైర్మన్లు కూడా దక్కించుకుని రంగారెడ్డి జిల్లాను బీఆర్ఎస్ కంచుకోటగా మారుస్తామని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
అత్యధిక సీట్లు సాధించడంపై హర్షం
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్ పార్టీ యువ నేతలు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, పట్నం అవినాశ్‌రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్తదితర నేతల నాయకత్వంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అత్యధిక సీట్లు సాధించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చక్రం తిప్పారు. 32 గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. నియోజకవర్గంలో ఆరుట్ల, రాయపోల్, అనాజ్‌పూర్, చింతపట్ల వంటి పెద్ద గ్రామాల్లో సైతం భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతో సమానంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడంలో ఆయన ఎంతో కృషిచేశారు.