సిటీబ్యూరో, మే 4 ( నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల్సిందేనని బీఎంఎస్ ఆటో యూనియన్ హెచ్చరించింది. ఉచిత బస్సుతో ఆటోవాలాల జీవనోపాధి దెబ్బతీసిన ప్రభుత్వం వారిని ఆదుకునే చర్యలు చేపట్టలేదని బీఎంఎస్ నాయకులు విమర్శించారు. మూడేండ్లు గడిచినా.. హామీలు అమలు చేయకపోవడంతో మంగళవారం ఇందిరాపార్క్‌లో ఉదయం 11 గంటల నుంచి భారీ ధర్నా చేపట్టనున్నట్టు బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పెంటయ్యగౌడ్ చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ రవాణా కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 150కి పైగా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే చర్యలు ప్రభుత్వం ఇప్పటికీ చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.