బొంరాస్పేట, జూలై 30 : మండలంలో వానాకాలం వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వానకాలంలో చెరువులు, కుంటల కింద రైతు లు వరి పంటను సాగు చేస్తుంటారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలవుతున్నా మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరలేదు. ఫలితంగా వీటికింద ఉన్న ఆయకట్టు బీడుగానే మిగిలే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో చెరువులు, కుంటలు నిండుతాయని వానాకాలంలో వరి పంటను సాగు చేయవచ్చని రైతు లు ఎంతో ఆశించారు. కానీ రైతుల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. గత రెండు సంవత్సరాలలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో వానాకాలంలో జిల్లాస్థాయిలోనే అత్యధికంగా మండలంలో 20,762 ఎకరాలలో వరి పంటను సాగు చేశారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 6500 ఎకరాలలో మాత్రమే వరినాట్లు వేశారు. ఆగస్టు రెండవ వారం వరకు వరినాట్లకు అవకాశం ఉన్నా వర్షాల జాడ లేకపోవడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు అనుకూలంగా ఉన్నాయి. భారీ వర్షాలు కుర వకపోవడంతో వ్యవసాయ బోర్లలో కూడా నీటిమట్టం పెరగలేదు. దీంతో చాలా మంది రైతులు బోర్ల కింద వరినాట్లు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు.
మండలంలో బొంరాస్పేట, మెట్లకుంట, కొత్తూరు, బురాన్పూర్, దుద్యాల, పోలేపల్లి, తుంకిమెట్ల, వడిచెర్ల గ్రామాల్లో 12 నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. వీటికింద సుమారు 3500 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. నీటి వనరులు నిండక పోవడంతో వీటికింద ఉన్న ఆయకట్టంతా బీడుగానే ఉంది. మరోవైపు జూన్, జూలై నెలల్లో మండలంలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షం కురిసినా చెరువుల్లోకి నీరు రాలేదు. మున్ముందు భారీ వర్షాలు కురిసి చెరువులు నిండితేనే యాసంగి సాగుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వ్యవసాయ బోర్లలో నీటిమట్టం ఇంకా పడిపోయి పంటల సాగుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.