పెద్దేముల్, మే 3 : అసమర్థ కాంగ్రెస్ పాలకుల వల్ల రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదిముబారక్ వంటి బృహత్తరమైన సంక్షేమ పథకాలు ఆగిపోయి ప్రజలు ఆగమవుతున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మంబాపూర్, పెద్దేముల్, గాజీపూర్ గ్రామాల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచిందన్నారు.
కరెంటు కోతలు, సాగునీటి ఎద్దడితో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఏటా రూ.15 వేల రైతుభరోసా, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి ధాన్యానికి రూ.500 బోనస్, ప్రతి కుటుంబానికీ రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగ యువకులకు నెలనెలా రూ.4 వేలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు తదితర హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పుకుంటూ తిరుగుతున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి.. ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, రోహిత్‌రెడ్డి సమక్షంలో కందనెల్లి గ్రామానికి చెందిన అంపల్లి రవి, వడ్ల వెంకటేశం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్, గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు టి.రమేశ్, మన్సాన్పల్లి రవినాయక్, మాజీ సర్పంచులు శ్రావణ్‌కుమార్, పాండు, హైదర్, నాయకులు నాగేందర్, ఇబ్రహీం, అరుణ్‌రాజ్, ఏజాజ్, లాజర్, దత్తు, బోయిని నారాయణ, వెంకటయ్య, సర్వేశ్వర్ రెడ్డి, బలరాం, సాయిలు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.