ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 29 : రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు లబ్ధిపొందే రైతుల్లో రెండోరోజు సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల ఆర్థిక అందించే కార్యక్రమం రెండోరోజూ కొనసాగింది. రంగారెడ్డిజిల్లాలో రెండోరోజు మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమైనట్లు జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. మొదటిరోజు రూ.32.40కోట్ల రైతుబంధు సాయం అందించారు. రెండో రోజు జిల్లాలోని 1,89,637 మంది రైతులకుగానూ రూ.88.50కోట్లను అందించారు. దీంతో జిల్లాలోని రైతుల్లో చిరునవ్వుల వ్యక్తమవుతున్నాయి. మూడోరోజూ రైతుల ఖాతాల్లో రైతుబంధు ఆర్థిక సాయం జమకానున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో 65,918కి.. రూ.51 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
బొంరాస్పేట, డిసెంబర్ 29 : రైతుబంధు పథకం ద్వారా జిల్లాలోని రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేయడం కొనసాగుతున్నది. బుధవారం మొదటి రోజు జిల్లాలోని ఎకరాలోపు భూమి ఉన్న 70,082 మంది రైతుల ఖాతాల్లో రూ.22 కోట్లు జమ చేయగా, గురువారం రెండో రోజూ 65,918 మంది రైతుల ఖాతాల్లో రూ.51 కోట్లను జమ చేసింది. పెట్టుబడి సాయం జమ అయిన వెంటనే ఫోన్లకు వస్తున్న సంక్షిప్త సమాచారం చూసుకుని రైతులు సమీపంలో ఉన్న బ్యాంకులు, సీఎస్సీ కేంద్రాలకు వెళ్లి డబ్బును తీసుకుంటున్నారు. యాసంగి సీజన్లో పెట్టుబడి సాయం సమయానికి రావడంపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతుబాంధవుడు సీఎం కేసీఆర్..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి కోసం ఏటా రెండుసార్లు రైతుబంధు సాయాన్ని అందజేస్తూ రైతుబాంధవుడయ్యారు. యాసంగికి అదునుకు డబ్బులు అందుతుండడంతో రంగారెడ్డి జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు పెట్టుబడి కష్టాలు తీరాయి. రైతుల సంక్షేమానికి నిత్యం పాటుపడే సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– వంగేటి లక్ష్మారెడ్డి,
రైతుబంధు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు