సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. నాచారంలోని ఆటో యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగడుతామన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమైనందున గురవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్‌కు పిలుపునిస్తున్నట్టు వెల్లడించారు.
ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరా పార్క్ వరకు డ్రైవర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ వాహన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆటో బంద్‌ను విజయవంతం చేస్తామని టీఏడీఎస్ నాయకుడు సత్తిరెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఏడాదికి రూ.12వేలు ఎప్పుడిస్తారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సారథి పోర్టల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.