Speaker Prasad Kumar | వికారాబాద్, జూన్ 21 : యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం అని తెలంగాణా రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో జరిగిన యోగా డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, విద్యార్థులతో పాల్గొని యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆచరించాలన్నారు. యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానమని నేను రోజు యోగా చేస్తానని తెలిపారు. యోగాను నిత్యం సాధన చేయడం ద్వారా మనిషిలో ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చని శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో యోగా పట్ల ప్రజలలో ఆసక్తి బాగా పెరిగిందని ఎక్కువ మంది యోగాను చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశంలో 2500 సంవత్సరాల క్రితం పతంజలి మహార్షి ద్వారా యోగ వెలుగులోకి వచ్చిందని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి యోగా ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని పేర్కొన్నారు.
యోగాను అన్ని వయసుల వారు చేయవచ్చని, స్వంతంగా కంటే గురువుల మార్గదర్శకంలో చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నారు. యోగాను మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, డీఎస్పీ శ్రీనివాస్, యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఇంచార్జి మహమ్మద్ అబ్దుల్ సత్తార్, ఎల్డిఎం యాదగిరి, ఆయుష్ సునీత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.