కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్. ఎన్నో ఏండ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం చేసిన మహోన్నత ఉద్యమ నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు మోకాలడ్డుతున్న వేళ ఆమరణ నిరాహార దీక్షకు దిగి ప్రాణాలకు తెగించిన గొప్ప పోరాట యోధుడు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినదించిన తెలంగాణ కెరటం ఆయన. గల్లీ నుంచి ఢిల్లీ మీదుగా ప్రపంచ దేశాల ప్రజలకు అభిమాన పోరాట యోధుడు కేసీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ. సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజానీకం, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
రవీంద్రభారతిలో బుధవారం జూనియర్ లెక్చరర్లకు నియామక ప్రతాలు అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి.. మాట్లాడుతూ.. ‘మీకు మీరే స్టేచర్ ఉందని ఫీలైతే.. స్ట్రేచర్ మీదకు పంపించారు.. ఇట్లనే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతారు.’ అంటూ అవహేళనగా దూషించారు. రేవంత్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డిది దుష్ట గుణం.. చావే కోరుకుంటారని.. కేసీఆర్‌ది దైవ గుణం.. అందరూ బాగుండాలని ఆశిస్తారని రఘువీర్ రాథోడ్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఖండించారు. మరో నెటిజన్ తిరుపతి మరుపాక ’దమ్ముంటే కేసీఆర్‌ను టచ్ చేసి చూడు’ అంటూ సవాల్ విసిరారు. నీచులు ఎప్పుడూ నీచంగానే మాట్లాడుతారని ఫైర్ అయ్యారు. శివ ప్రసాద్ నారాయణ అనే నెటిజన్ స్పందిస్తూ ‘’ అయ్యా గుంపు మేస్త్రీ నీకు స్ట్రేచర్ పదానికి కనీసం స్పెల్లింగ్ తెలుసా” అంటూ ఎద్దేవా చేశారు.
మరో నెటిజన్ స్పందిస్తూ కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి-మన చిట్టి నాయుడి కోసమే రాసినట్టు ఉంది ఈ పద్యమంటూ రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నెటిజన్ ప్రేమ్ రెడ్డి స్పందిస్తూ.. అయ్యా రేవంత్ నీ పేరు చివరన రెడ్డి అనే పదం తీసెయ్..నువ్వు మాట్లాడే మాటలకు రెడ్డి పరువు పోతున్నది అంటూ ఎద్దేవా చేశారు. మరో నెటిజన్ ప్రభాకర్ స్పందిస్తూ నువ్వు ఎర్రగడ్డకు పోవడం ఖాయమన్నారు. సీఎం రేవంత్‌ను ఉద్దేశించి సంతోష్ అనే నెటిజన్ స్పందిస్తూ.. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్.. రేవంత్ ఓవరాక్షన్‌కు బ్రేకులు వేయాల్సి ఉండే ..అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో నెటిజన్ మధురెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే 5 సీట్లు కూడా రావని.. ప్రచారం చేయకపోయినా కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మరో వ్యక్తి సంతోష్ స్పందిస్తూ.. ఓటుకు నోటు కేసు ప్రస్తావిస్తూ.. ఇంతకీ 50 లక్షలు బ్యాగ్ ఎక్కడివి అంటూ విమర్శించారు.
విజ్ఞతను కోల్పోయి మాట్లాడకు..
రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తిపై సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. రేవంత్‌కు ఇది మంచిది కాదు.. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. సీఎం కుర్చీని కూడా ఆయన దిగజార్చి మాట్లాడుతున్నారు. దినదినం విజ్ఞతను కోల్పోతున్నారు.
స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి గల్లీ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. రవీంద్రభారతిలో జరిగిన జూనియర్ లెక్చరర్ల సమావేశంలో ఆయన దిగజారి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రిని మార్చురీకి పంపిస్తామని మాట్లాడటాన్ని ఆయన వివేకానికే వదిలిపెడుతున్నాం. రాష్ట్ర రాజకీయాలను సీఎం రేవంత్‌రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారు. రాజకీయాల్లో హుందాతనమే లేకుండా పోయింది. ఆయన స్థాయిని తగ్గించుకుని మాట్లాడటం సమంజసం కాదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటాలు చేసి రాష్ర్టాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. కేసీఆర్ శ్రమ ఫలితంగా వచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. రాష్ట్రమే సాధించకపోతే ఆయన పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను గౌరవించే సంప్రదాయాలు నేర్చుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మరిచి బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ రాష్ట్రంగా సీఎం రేవంత్‌రెడ్డి మార్చాడు.
– బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు
సీఎం రేవంత్‌రెడ్డి మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసి రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దే అన్న విషయాన్ని కూడా విస్మరించి ఆయనపై అనుచిత వాఖ్యలు చేయటం సిగ్గుచేటు. సీఎంగా రేవంత్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారు. అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి అలవికాని హామీలిచ్చారు. ప్రజలంతా రేవంత్‌రెడ్డిని చీదరించుకుంటున్నారు. కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ స్ట్రెచర్‌పైకి పోయాడని, మార్చురీకి పోతాడని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనం. ఆయన తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు.
– అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే, షాద్‌నగర్
రేవంత్‌రెడ్డి రాజకీయ అజ్ఞాని
రేవంత్‌రెడ్డి ఓ రాజకీయ అజ్ఞాని. ఆయన రాజకీయాల్లో చీడపురుగులాంటి వాడు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తిని పట్టుకుని స్ట్రెచర్, మార్చురీ లాంటి మాటలు సంబోధించడం సిగ్గుచేటు. రేవంత్‌రెడ్డి ప్రజల అభిమానాన్ని పోగొట్టుకోవటంతోపాటు అధిష్ఠానం వద్ద కూడా చులకన అయ్యారు. దాని నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం కేసీఆర్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రేవంత్‌కు రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదు. ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా రేవంత్ గౌరవించే సంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలి.
– జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే, కల్వకుర్తి
రేవంత్.. నోరు అదుపులో పెట్టుకో
రేవంత్.. నోరు అదుపులో పెట్టుకో.. నీ చిల్లర కూతలు ఆపు.. లేదంటే ప్రజలే తరిమికొడతారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, దేశంలోనే అగ్రభాగాన నిలిపిన కేసీఆర్‌ను బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ‘ప్రజా ప్రభుత్వంలో కొలువుల జాతర’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు కేసీఆర్.. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే ఐటీ మేటీగా నిలిపిన నేత కేటీఆర్.. సాగు నీటి రంగంలో విప్లవాన్ని తెచ్చిన నేత హరీశ్‌రావు.. అలాంటి వారిని నోటికి వచ్చినట్లు మాట్లాడడం రేవంత్‌రెడ్డి చిల్లరతనానికి నిదర్శనం. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన కేసీఆర్‌ను ఎక్కడ బడితే అక్కడ వ్యక్తిగతంగా రేవంత్ విమర్శించడం సరికాదు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మరిచి బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ రాష్ట్రంగా సీఎం రేవంత్‌రెడ్డి మార్చాడు. రేవంత్… ఒక కార్యక్రమమైనా విజయవంతంగా నిర్వహించావా..? కేసీఆర్‌ను తిట్టుకుంటా పబ్బం గడపడం తప్ప నువ్వు చేస్తున్నదేమిటి? కేసీఆర్ కుటుంబంపై విమర్శలు ఆపి రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలి.
– పంజుగుల రోహిత్‌రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే
చిల్లరగా మాట్లాడటం సరికాదు
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రజా పాలనను గాలికి వదిలేసి కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పొద్దుగడుపుతున్నారు. సంవత్సరానికిపైగా కేసీఆర్, కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేస్తున్నారు. చేతనైతే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చి చూపాలి. ఇష్టానుసారంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు ఆపి రాష్ట్ర ప్రజల అభివృద్ది, సంక్షేమానికి కృషి చేయాలి. ఇన్నేళ్ల కాలంలో ఈ విధమైన సీఎంను చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని వ్యక్తులను గౌరవించడం నేర్చుకో..
– బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
చేతగాని సీఎంతో తెలంగాణ తలవంచుకొంటున్నది
రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకొన్నామా అని నేడు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. సీఎం హోదాలో ఉంటూ బూతు పురాణం వల్లె వేయడం మానుకోవడంలేదు. తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పాలన చేతకాక ఈ విధంగా కేసీఆర్ కుటుంబంపై అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదేం ఆయనకు కొత్త కాదు. కానీ సీఎం హోదాలో ఉండి, తెలంగాణకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఆయననే ఈ విధమైన అనుచిత వాఖ్యలు చేస్తే.. రానున్న రోజుల్లో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు.. తస్మాత్ జాగ్రత్త. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు. పదేళ్లు తెలంగాణను దేశ చరిత్రలో ఉన్నత స్థానాన్ని నిలిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్. గడిచిన 15 నెలల కాలంలో రేవంత్ తెలంగాణకు ఒకగబెట్టిందుమీలేదు. నోటి దురుసు తప్ప, అభివృద్ధిపై ఆయనకు కించిత్తు కూడా శ్రద్ధలేదు. నోటి దురుసు చాలించి అభివృద్ధి చేసి చూపించు. గతంలో ఏ సీఎంను ఈవిధంగా బూతులు తిట్టిన ప్రజలు లేరు. కానీ నేడు ఎక్కడ చూసినా సీఎంపై ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. అభివృద్ధితో ప్రజలతో మంచి అనిపించుకో ఇదే నా సలహా..
– పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్
మతిభ్రమించి మాట్లాడుతున్న సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనను సీఎం పదవి నుంచి తప్పిస్తుందనే ఫ్రస్టేషన్లో సీఎం రేవంత్‌రెడ్డి నోటికి వచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో ఎన్నికల హామీలను పూర్తిగా పక్కన పెట్టి, ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేశారు. రేవంత్ పాలన నచ్చకపోవడంతో ప్రజలు తిరగబడే పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం సైతం రేవంత్‌రెడ్డిని పక్కన పెట్టడంతో ఏమి చేయాలో పాలుపోవడంలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై సీఎం రేవంత్ అవాకులు, చవాకులు పేలుతున్నారు. పాలన చేతకాకనే ప్రతిపక్షాలపై రేవంత్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎలా మాట్లాడాలో సైతం తెలియడంలేదు. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన కేసీఆర్‌ను ఎక్కడ బడితే అక్కడ వ్యక్తిగతంగా రేవంత్ విమర్శించడం సరికాదు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి తన ధోరణి మార్చుకోవాలి, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
– కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే