రంగారెడ్డి, జనవరి 25 (నమస్తేతెలంగాణ) : జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగియనున్నది. 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లల్లోని పాలకవర్గాలను అధికారులు ఘనంగా సన్మానిస్తున్నారు. బడంగ్‌పేట, మీర్పేట్ కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం కూడా ఆదివారంతో ఐదేండ్లు నిండనున్నాయి. ఆయా మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్చైర్మన్లు, కౌన్సిలర్లను అధికారులు సన్మానిస్తున్నారు. హైదరాబాద్ శివారుల్లోని ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, ఆమనగల్లు, షాద్‌నగర్, కొత్తూరు, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, మణికొండ, బండ్లగూడ మున్సిపాలిటీలు ఉన్నాయి.
మున్సిపాలిటీల పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారులను నియమించేందుకు జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారులను నియమించనున్నారు.
మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల నియామకంపైన దృష్టి పెట్టింది. ఇప్పట్లో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ప్రత్యేకాధికారుల పాలనలోగ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది.