బొంరాస్‌పేట, మే 23 : పేద విద్యార్థులు చదువులో ప్రతిభ చూపిస్తున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. కొందరు మంచి మార్కులు సంపాదించినా కార్పొరేట్ కళాశాలల్లో చదవాలన్న కోరిక మాత్రం నెరవేరడం లేదు. అలాంటి వారికి ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి అండగా నిలుస్తున్నది. పదోతరగతిలో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందిస్తున్నది. ఆయా కులాల రిజర్వేషన్ ఆధారంగా కేటాయించిన సీట్ల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. జూన్ 3వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో విద్యార్థికీ ప్రభుత్వం రూ.35 వేలు ఫీజు, పాకెట్ మనీగా ఏడాదికి రూ.3 వేలు అందిస్తుంది. ప్రవేశం పొందిన కళాశాలలోనే ఉచిత విద్యతోపాటు భోజనం, వసతిని కూడా కల్పిస్తారు.
వార్షిక ఆదాయం రూ. రెండు లక్షలు దాటొద్దు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, బీసీ, మైనార్టీ, ఈబీసీలైతే రూ.లక్షకు మించకూడదు. విద్యార్హతలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 7.0-10 జీపీఏ మార్కులు సాధించి ఉండాలి. సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యముంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, ఏయిడెడ్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు రెండో ప్రాధాన్యం.. గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మూడో ప్రాధాన్యం, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివిన వారికి నాల్గో ప్రాధాన్యం కింద ప్రవేశాలు కల్పిస్తారు. వచ్చిన దరఖాస్తులనుబట్టి కేటాయించిన సీట్లు, సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా విడుతల వారీగా కార్పొరేట్ కళాశాలల్లో అధికారులు ప్రవేశం కల్పిస్తారు.
హైదరాబాద్, మహబూబ్‌నగర్ కళాశాలల్లో ప్రవేశం
వికారాబాద్ జిల్లాలో పదోతరగతి పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి, భాష్యం, ఎన్ఆర్ఐ తదితర కార్పొరేట్ కళాశాలల్లో, మహబూబ్‌నగర్‌లోని ప్రతిభ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం ఇలా..
విద్యార్థులు జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ-పాస్ వెబ్సైట్లో కార్పొరేట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి అన్ని వివరాలను పూర్తి చేసి దరఖాస్తు చేయాలి. ఇందుకోసం విద్యార్థులు కులం, ఆదాయ ధ్రువపత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఎస్సెస్సీ మెమో, ఆధార్‌కార్డు, వసతి గృహాల్లో 8, 9, 10వ తరగతి చదివితే హాస్టల్ ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, రేషన్ కార్డు జిరాక్సు ఇవ్వాల్సి ఉంటుంది.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
పదోతరగతిలో మంచి మార్కులు సాధించి ఆర్థిక పరిస్థితులు అనుకూలించని వారికి ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా ప్రవేశం కల్పించి విద్యను అందిస్తున్నది. ఎస్సెస్సీలో 7.0. నుంచి 10 జీపీఏ మార్కులు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు జూన్ 3వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమైంది. గతేడాది 52 మంది దరఖాస్తు చేసుకోగా వారికి వివిధ కార్పొరేట్ కళాశాలల్లో సీట్లు కేటాయించగా ప్రవేశం పొందారు.
-మల్లేశం, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ అధికారి