జిల్లాలోని పేదలు సొంతింటి కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది అప్పోసప్పో చేసి స్థలాలు కొనుగోలు చేశారు. ఇందిరమ్మ పథకంలో నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో.. ఇంటి నిర్మాణానికి డబ్బుల్లేని పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరీక్షిస్తున్నారు. తాజాగా, ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఇంటి నిర్మాణానికి నిధులిస్తామని సర్కారు చెప్పడంతో దరఖాస్తులుదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. అయితే, జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ప్రజాపాలనలో 3,75,000 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రేవంత్ సర్కార్ నియోజకవర్గానికి 3500 చొప్పున మాత్రమే ఇండ్లను కేటాయించడంతో అర్హులందరికీ ఇండ్లు వస్తా యా..? పేదలు, గుడిసెవాసుల సొంతింటి కల నెరవేరేనా..? అన్న సం దేహం, అయోమయం నెలకొన్నది.
-రంగారెడ్డి, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ)
జిల్లాలో ప్రజాపాలన కింద 3,75,000 మంది డబుల్‌బెడ్ రూమ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిరుపేదలతోపాటు సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమతలేని వారంతా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే రేవంత్ సర్కారు మాత్రం నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో అవి ఏ మూల సరిపోని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ ప్రకటన అర్హులైన లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. దీంతో చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కోసం గ్రామ, మండల స్థాయిలో కమిటీలనూ వేసింది. అందులో కాంగ్రెస్ నాయకులే ఉండడంతో ఇండ్ల కేటాయింపు కూడా వారి చేతుల్లోనే ఉంటుందని పైరవీల బాటపట్టారు.
గుడిసె వాసులకు ఇండ్లు దక్కేనా..
రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా పరిస్థితి ఇతర జిల్లాల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ జిల్లా హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉండడంతో పెద్దఅంబర్‌పేట, హయత్‌నగర్, ఆదిబట్ల, తుక్కుగూడ, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ వంటి మున్సిపాలిటీలకు ఇతర రాష్ర్టాలు, ఇతర జిల్లాల నుంచి వేలాది మంది వచ్చి ఉపాధి పొందుతున్నారు. వారిలో చాలా మంది కొన్నేండ్లుగా ఇక్కడే నివసిస్తూ ఆధార్, రేషన్‌కార్డులను కూడా పొందారు. వారిలో చాలామంది స్థలాలు కొనుగోలు చేసి.. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. వారిలో ఎంతమందికి ఇండ్లు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది.
అర్హులందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి..
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. ఎన్నో ఏండ్లుగా సొంత ఇండ్లు లేక పేదలు అనేక అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలి. సెగ్మెంట్‌కు 3,500 ఇండ్లు ఏ మాత్రం సరిపోవు. వాటిని పెంచాలి. కొన్నేండ్లుగా గుడిసెల్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి.
-కావలి నర్సింహ, సీపీఐ నాయకుడు
పేదలకు న్యాయం చేయాలి
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను నెర వేర్చాలి. చాలామంది అప్పోసప్పో చేసి స్థలాలు కొనుగోలు చేశారు. ఇండ్ల ను నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేక అద్దె ఇండ్లలో ఉంటున్నారు. కొందరు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వారందరికీ ఇందిరమ్మ పథకం కింద నిధులు మంజూరు చేసి ఆదుకోవాలి. బ్రోకర్లకు ఆస్కారం ఇవ్వొదు.
– జగదీశ్, సీపీఎం నాయకుడు