జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణలో సర్కారు అడుగులు అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు మున్పిపాలిటీల్లోని అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వారం రోజులుగా ఆందోళన జరుగుతున్నా స్థానికంగా వచ్చిన ప్రశ్నలపై నివృత్తి చేయని జీహెచ్ఎంసీ.. తాజాగా వార్డుల డీలిమిటేషన్ (పునర్విభజన)పై బుధవారం నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ డీలిమిటేషన్‌పై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. జీవో నం 570 ప్రకారంగా జీహెచ్ఎంసీని 300 ఎన్నికల వార్డులుగా విభజించినట్లు ప్రకటించారు. సరిహద్దు వివరణ వివరాలను అన్ని సర్కిల్ కార్యాలయాలు, జోనల్, ప్రధాన కార్యాలయాల భవనాల నోటీసు బోర్డులపై ఉంచినట్లు పేర్కొన్నారు. వివరాలు జీహెచ్ఎంసీ వెబ్సైట్ www.ghmc.gov.inలో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఏవైనా సూచనలు, లేదా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.
– సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
బడంగ్‌పేట : బడంగ్‌పేట సర్కిల్‌ను ఎల్బీనగర్ జోన్లో కలుపాలని రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. అన్ని పార్టీల నాయకులు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. బస్తీల్లో సంతకాల సేకరణా చేపడుతున్నారు. ప్రజల మద్దతును కూడగడుతూ కాలనీల్లో పర్యటిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. బడంగ్‌పేట్‌ను చార్మినార్‌లో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని, అన్ని వర్గాల ప్రజల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని కమిషనర్‌కు తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా చేయడంతో అయోమయానికి గురవుతున్నారు. అందరూ జేఏసీగా ఏర్పాటై బడంగ్‌పేటను ఎల్బీనగర్లో కలిపే వరకు ఉద్యమిస్తామన్నారు. చార్మినార్ జోన్లో కల్పితే నష్టపోతామని వాపోతున్నారు
జీహెచ్ఎంసీలో ఇప్పటివరకు ఉన్న ఆరు జోన్లను పది జోన్ల పెంచి విభజించినట్లు తెలుస్తున్నది. ఒక్కో జోన్‌కు 30 వార్డుల చొప్పున 50 సర్కిళ్లకు మొత్తం 300 వార్డులు విభజించారు. కీసర తొలి డివిజన్‌గా 300వ డివిజన్‌గా తూంకుంటతో ముగించారు. వార్డుకు 40 వేల నుంచి 50వేల జనాభా చొప్పున 300 డివిజన్లను ఖరారు చేశా రు. కొన్ని డివిజన్లలో భౌగోళికంగా విస్తీర్ణం పెద్దగా ఉండి..జనాభా తక్కువగా ఉన్న కొత్త డివిజన్‌గా ఖరారు చేశారు. మొత్తానికి సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో 10 రోజులుగా డీలిమిటేషన్ ప్రక్రియను హడావుడిగా పూర్తి చేసి చివరి ఘట్టమైన అభ్యంతరాలపై తక్కువ సమయంలో ప్రజల ముందు పెట్టడం విశేషం.
విలీనంలోనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ శాస్త్రీయత లేకుండా 300 డివిజన్లు ఖరారు చేసి ఈ వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు, సలహాలను స్వీకరించే క్రమంలోను ప్రజాభిప్రాయాలకు గౌరవం ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. హడావుడిగా డివిజన్లను ఖరారు చేయడమే కాకుండా వారం వ్యవధిలోనే ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమైన తీరుపై తీవ్ర అనుమానాలున్నాయి. ప్రభుత్వం ముందుగానే విలీనం, వికేంద్రీకరణపై సీజీజీ వేదికగా ముగించి మొక్కుబడిగా ప్రజల ముం దుకు ప్రతిపాదనలు తీసుకురావడంపై విమర్శలున్నాయి.
నేటి డిజిటల్ యుగంలో అభ్యంతరాలను మ్యాన్వల్గా, లిఖితపూర్వకంగా మాత్రమే స్వీకరిస్తామని ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే పనులన్నీ మానుకుని డివిజన్ల అభ్యంతరాలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ కార్యాలయానికి రావాలని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు తప్ప మిగిలిన అన్నీ వర్గాలను వికేంద్రీకరణ ప్రక్రియలో దూరం చేశారు. డివిజన్ల ఖరారులో నాలుగు వైపులా (నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్) అం టూ సర్వే నంబర్లు, బౌండరీలను ఫిక్స్ చేసి ప్రజల ముందు ఉంచారు. కనీసం జీహెచ్ఎంసీ వెబ్సైట్లో మ్యాప్‌లను పొందుపర్చకపోవడం గమనార్హం.
వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలను మాన్యువల్‌గా, లిఖితపూర్వకంగా మాత్రమే స్వీకరిస్తారు. అంతేకాకుండా ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలను మరింత లోతుగా చర్చించ డం, పరిశీలించడం తక్కువ సమయంలోనే అధికారులు ఎలా పూర్తి చేస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. రాబోయే 10 రోజుల్లో ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించి, కౌన్సిల్లో ఆమోదముద్ర వేసుకుని చకచకా ప్రభుత్వం నుంచి ఫైనల్ గెజిట్ విడుదల చేసేలా మాస్టర్ ప్లాన్ ఖరారు చేయడం వెనుక మతలబులెన్నో ఉన్నాయన్న చర్చ జరగుతున్నది. కాగా, ప్రస్తుత పాలక మండలి గడువు ముగింపు ఫిబ్రవరి 11 తర్వాత జీహెచ్ఎంసీని ఒక కార్పొరేషన్ చేస్తారా..? ముక్కలుగా విభజిస్తారా..? అన్నది తేలాల్సి ఉంది. లేదంటే వార్డు పునర్విభజన పూర్తికాగానే రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్తారా? అన్నా చర్చ లేకపోలేదు.