జిల్లా విద్యాశాఖలోకి వలసల జోరు పెరుగుతున్నది. నగర శివారు వరకు జిల్లా విస్తరించడంతో ఇతర జిల్లాల ఉపాధ్యాయులు వలస వచ్చేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. 20 శాతం ఉండాల్సిన స్థానికేతరులు.. ప్రస్తుతం 50 శాతానికి పైగా మించిపోయారు. దీంతో జిల్లాలోని నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకంటే రంగారెడ్డి జిల్లాలోని విద్యాశాఖలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ఉద్యోగం కోసం ఇతర జిల్లాల నుంచి తీవ్ర పోటీ నెలకొన్నది. ఇతర జిల్లాల్లో ఖాళీలు భర్తీకాని పరిస్థితిలో రంగారెడ్డి జిల్లాలో ఉండాల్సినదానికంటే, సుమారు 400ల మందికి పైగా ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం. జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొన్నిచోట్ల విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే అధికంగా ఉన్నారు. ఈ విచిత్ర పరిస్థితికి ఇతర జిల్లాల నుంచి వివిధ మార్గాల ద్వారా జిల్లాలోకి రావడమే కారణమని తెలుస్తున్నది. జిల్లావ్యాప్తంగా 1,350 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 8,529 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పాఠశాలలకు సరిపడా కంటే అధికంగా ఉపాధ్యాయులు ఉన్నారు.
– రంగారెడ్డి, జనవరి 27 (నమస్తే తెలంగాణ)
స్థానికతను అడ్డం పెట్టుకుని..
మహబూబ్‌నగర్ జిల్లాలోని పది మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలపడం వల్ల ఆ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు 317 జీవోను అడ్డం పెట్టుకుని సుమారు 400 నుంచి 600ల వరకు రంగారెడ్డిజిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలో విలీనమైన షాద్‌నగర్ నియోజకవర్గంలోని మండలాలు, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలిశాయి. దీంతో ఆ జిల్లా ఉపాధ్యాయులకు కూడా జిల్లాలో స్థానికత లభించింది. దీని ఆధారంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి అనేక మంది జూనియర్లను ముందుగా జిల్లాకు కేటాయించారు. దీంతో జూనియర్లను ఎలా కేటాయిస్తారంటూ.. తమను కేటాయించాలని సీనియర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ద్వారా సీనియర్లు కూడా జిల్లాలోకి పెద్ద ఎత్తున ప్రవేశించారు. ఆ సమయంలో జూనియర్లను వెనక్కి పంపించకపోవడం వల్ల జూనియర్లు, సీనియర్లు రంగారెడ్డి జిల్లాలోనే ఉండిపోయారు. దీనికి తోడు మెడికల్ గ్రౌండ్ కింద మరికొందరు, (స్పౌస్) భార్యాభర్తల జీవోతో మరికొంతమంది జిల్లాకు వచ్చారు. దీంతో 20 శాతం ఉండాల్సిన స్థానికేతరులు, 50 శాతానికి మించిపోయారు. దీంతో జిల్లాలో సగానికి పైగా స్థానికేతరులైన ఉపాధ్యాయులు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టుల వివరాలు..
జిల్లాలో మొత్తం 8,529 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఎస్జీటీలు 4,054, స్కూల్ అసిస్టెంట్లు 3,397, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 276, ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 200 మంది ఉన్నారు. వీరిలో సగానికి పైగా మహబూబ్‌నగర్, నల్లగొండ, యాదాద్రిభువనగిరి వంటి జిల్లాల నుంచి వచ్చినవారే ఉన్నారు. స్థానికులు మాత్రం ఇతర జిల్లాల్లో ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్థానిక నిరుద్యోగులకు తీరని అన్యాయం..
317 జీవోను అడ్డం పెట్టుకుని వివిధ క్యాటగిరీల్లో ఉపాధ్యాయులు జిల్లాలోకి వచ్చారు. భార్యాభర్తల బదిలీలు, మెడికల్ గ్రౌండ్ వంటి కోటాల కింద పెద్ద ఎత్తున వస్తున్నారు. రాజకీయ పలుకుబడితో కొంతమంది, ప్రభుత్వ జీవోల ద్వారా మరికొంతమంది జిల్లాలోకి వస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చేవారితో రంగారెడ్డి జిల్లాలోని ఉద్యోగాలన్నీ భర్తీ అవుతున్నాయి. కానీ, జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు మాత్రం తీరని అన్యాయం జరుగుతున్నదని వాపోతున్నారు. ఉన్నత చదువులు అభ్యసించి బీఈడీ, డీఈడీ, పూర్తి చేసి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ క్వాలిఫై ఎంతోమంది ఉన్నారు. వీరంతా డబ్బులు ఖర్చుపెట్టుకుని డీఎస్సీ కోచింగ్‌లకు వెళ్లి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరికీ ఉద్యోగావకాశాలు రావడానికి అక్రమ వలసలు అడ్డంకిగా మారాయి. జిల్లాలో ఖాళీలు లేకపోవడం వల్ల వికారాబాద్, నల్లగొండ వంటి జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇతర జిల్లాల నుంచి వచ్చే వలసలను నిలిపివేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు.
స్థానికేతరులతో జిల్లాకు తీవ్ర అన్యాయం..
జీవో 317ను అడ్డం పెట్టుకుని వివిధ కారణాల చేత అడ్డదారిలో జిల్లాలోకి ఇతర ప్రాంతాల ఉపాధ్యాయులు రావడంతో జిల్లాలోని నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. కొత్తగా ఉద్యోగాలు సంపాదించినవారు జిల్లాలో ఖాళీ లేకపోవడం వల్ల ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 4 నుంచి 6వేల మంది ఉపాధ్యాయులు వచ్చారు. స్థానికత ఆధారంగా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముందుగా జూనియర్లు వచ్చారని, జూనియర్లను ఎలా పంపిస్తారంటూ సీనియర్లు కోర్టు ద్వారా వచ్చారు. జూనియర్లను తిరిగి పంపించకపోవడం వల్ల ఆ జిల్లాకు చెందినవారే అధికంగా ఉన్నారు. దీంతో జిల్లా వాసులకు తీరని అన్యాయం జరుగుతున్నది.
– సత్తారి రాజిరెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి