రంగారెడ్డి, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): జిల్లాలో పలువురు ప్రభుత్వ టీచర్లకు జూలై నెలకు సంబంధించిన జీతాలు ఇంకా రాలేదు. ఆగస్టు 18వ తేదీ వచ్చినప్పటికీ జీతాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జిల్లాలో బదిలీలు, ప్రమోషన్లపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఈ పరిస్థితి ఏర్పడింది. జూన్ నెలాఖరులో రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టారు. దీంతో కొంతమంది ఉపాధ్యాయులు జూలై 1 వరకు పాత పాఠశాలలో కొనసాగి 2వ తేదీన కొత్త పాఠశాలలకు వెళ్లారు.
మరికొందరు జూలై 4న పాత పాఠశాలల్లోనే విధులు నిర్వర్తిస్తే 5వ తేదీన బదిలీలు, పదోన్నతులపై వేరే పాఠశాలలకు వెళ్లారు. అయితే గతంలో పనిచేసిన పాఠశాలల్లో విధులు నిర్వర్తించిన ఒక రోజు, నాలుగు రోజులకు సంబంధించిన వేతనాలు మాత్రమే ఆగస్టు 1న టీచర్ల ఖాతాల్లో జమ అయ్యాయి. కొత్త పాఠశాలల్లో విధులు నిర్వర్తించిన మిగతా రోజులకు సంబంధించిన జీతాలు విడుదల కాలేదు. దీంతో జిల్లాలో బదిలీ, పదోన్నతులపై వెళ్లిన సుమారు 1500 మంది ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్నత పాఠశాలల్లో పాఠశాల హెచ్ఎంలు, ప్రైమరీ పాఠశాలల్లో ఎంఈవోలు సకాలంలో బిల్లులు చేసి ఎస్టీవో కార్యాలయంలో సబ్మిట్ చేసినప్పటికీ ప్రభుత్వం జీతాలను విడుదల చేయకపోవడంపై ఉపాధ్యాయవర్గాలు మండిపడుతున్నారు. ఒకటో తేదీన్నే జీతాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ నెల జీతాలను సకాలంలో ఇవ్వడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ నెల జీతాన్ని వెంటనే అందించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయమై డీఈవో సుశీందర్‌రావును వివరణ కోరగా.. వేతనాల విషయం తన దృష్టికి రాలేదన్నారు. డీటీవోతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ వైఫల్యమే..
జిల్లాలోని పలువురు టీచర్లకు ఈ నెల జీతాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. చాలామంది టీచర్లకు వేరే ఆదాయ మార్గం లేదు. టీచర్లకు ఏ నెలకు ఆ నెల జీతం ఒకటో తేదీన వస్తేనే జీవనం చక్రం ముందుకు సాగుతుంది. నెలవారీ బడ్జెట్ ప్రకారం కుటుంబాన్ని నెట్టుకురావాలంటే టైమ్‌కు జీతాలు అందాలి. ఈ నెల జీతాలు రాకపోవడంతో బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేక డిఫాల్టర్లుగా మారాల్సి వస్తున్నది. తీసుకున్న రుణాలకు పెనాల్టీ కట్టాల్సి రావడంతోపాటు సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది.
-సత్తారి రాజిరెడ్డి, టీఎస్పీఆర్టీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి