కొడంగల్, జూన్ 6: బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎంఈవో రాంరెడ్డి అన్నారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఎమ్మార్సీ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుకునే విధంగా పాఠశాలల్లో అన్ని విధాలా సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు.
ఉచితంగా ఉదయం టిఫిన్‌తో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ..ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం వంటి ఎన్నో సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాంతో పాటు మెప్మా, ఎంఈవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కులకచర్ల : కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని వివిధ పాఠశాలల్లో మొదటి రోజు బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, ఏఏపీసీ కమిటీ సభ్యులు హాజరై ప్రారంభించారు. బడిబాట కార్యక్రమం సందర్భంగా మొదటి రోజు ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో ఉన్న పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించినట్లు బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళలతో మానవహారం నిర్వహించారు. సాల్వీడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఎం శోభ, ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్పర్సన్లు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.
బషీరాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లలోనే చేర్పించాలని బహదూర్పుర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింహారెడ్డి అన్నారు. ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించి, విద్యార్థుల తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వెంకటమ్మ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తాండూరురూరల్ : బడీడు పిల్లలందరూ పాఠశాలల్లో చేర్పించేలా అమ్మఆదర్శ కమిటీలు పని చేయాలని తాండూరు మండల మండల విద్యాధికారి వెంకటయ్యగౌడ్ అన్నారు. గురువారం మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీహెచ్ స్కూల్స్‌లో అమ్మ ఆదర్శ కమిటీలతోపాటు ఉపాధ్యాయులందరూ సమావేశం నిర్వహించారని తెలిపారు.
మండలంలోని ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం నాగప్ప ఆధ్వర్యంలో మొదటి రోజు అమ్మ ఆదర్శకమిటీలతోపాటు వీవోలు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించి, సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉపాధ్యాయులు జ్యోతి, శిరీష, జయశ్రీ, భాగ్యశ్రీ పాల్గొన్నారు.
పెద్దేముల : తల్లిదండ్రులు తమ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పెద్దేముల్ ప్రాథమిక పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం జె.శ్రీనివాసులు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో ప్రొ.జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో బడిబాటలో ఈ నెల 6 నుంచి 19వరకు నిర్వహించే కార్యక్రమాలపై చర్చించి ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో ఏఏపీసీ కమిటీ చైర్మన్ అక్షయ, జడ్పీహెచ్ఎస్ బాలికల హెచ్ఎం అక్కమాదేవి, ఫైమిదా బేగం, పాఠశాల ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, వెంకటలక్ష్మి, సంగీత, నఫీజ్ సుల్తానా, రాధా పాల్గొన్నారు.
దోమ మండల కేంద్రంలో
దోమ : బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీవో మహేశ్‌బాబు అన్నారు. గురువారం దోమ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి హరిశ్చందర్తో కలిసి ఎంపీడీవో మహేశ్‌బాబు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి బయటి పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించే దిశగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దోమ పాఠశాలల హెచ్ఎంలు రాములు, రమేశ్, స్వాతి, కమలారెడ్డి, శ్రీనివాస్, సీఆర్పీ సతీశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ధారూరు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి బడిబాట లక్ష్యాలను వివరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.
కులకచర్ల : రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గుంతలు సిద్ధం చేయాలని కులకచర్ల ఎంపీడీవో రామకృష్ణనాయక్ అన్నారు. గురువారం కులకచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లో మొక్కల పెంపకం సక్రమంగా నిర్వహించాలని అన్నారు. దీనితో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలని అన్నారు. సమావేశంలో ఎంపీవో కరీమ్, ఏపీవో చంద్రశేఖర్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
బొంరాస్‌పేట : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా గురువారం బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. మదన్‌పల్లితండా, తుంకిమెట్ల, ఎన్నెమీదితండాల్లో హెచ్ఎంలు శ్రీనివాస్, ఉమాదేవి తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి బడిబాట లక్ష్యాలను వివరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. పూర్యానాయక్తండా, బొట్లవానితండా, బాపల్లితండా, బొంరాస్‌పేట ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎంలు రవీందర్‌గౌడ్, రాజశేఖర్, గోపాల్, హరిలాల్ ఆధ్వర్యంలో బడిబాట ర్యాలీలు నిర్వహించారు.