తాండూరు, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. యాలాల మండల పరిధిలోని 37 గ్రామాల నుంచి వేలాది మంది కార్యకర్తలు డప్పుచప్పుళ్లతో ఉత్సాహంగా పటాకులు కాలుస్తూ తరలివచ్చారు. కళాకారుల ఆటపాటలు, గిరిజన మహిళల నృత్యాలతో పాటు గులాబీ శ్రేణుల నినాదాలు ఆత్మీయ సమ్మేళనం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను దేశానికి ఆదర్శంగా చేయడానికి సీఎం కేసీఆర్ విజన్‌తో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. మన ఊరు-మన బడి పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి కేజీ టూ పీజీ విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు, మిషన్ కాకతీయతో వ్యవసాయానికి సాగు నీరు అందుతున్నట్లు చెప్పారు. రంగారెడ్డి-పాలమూరు ప్రాజెక్ట్‌తో తాండూరు ప్రాంతానికి సాగునీరు అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తాండూరు నియోజకవర్గానికి రూ. వేల కోట్ల నిధులు తీసుకురావడంతో తాండూరు రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. తాండూరు బిడ్డగా ఎన్నికల్లో గెలిపించినందుకే ప్రజల దయతో ఎమ్మెల్యేగా ఉన్నానంటూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పర్యాద కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా దూసుకుపోతున్నదన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో రూ. వేల కోట్లు రైతుబంధుకు కేటాయించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు.
జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కారు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రత్యేక నిధులు, పథకాలు ప్రవేశ పెడుతుందన్నారు. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రతి పల్లెలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, జిగేల్ మనే లైట్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి గ్రామానికీ రూ.50 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు రావడం సంతోషకరమన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ యాలాల మండలం అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిస్తున్న ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేశ్, కోఆప్షన్ సభ్యులు అక్బర్‌బాబా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్‌చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.