యాచారం, జూన్ 3: ఉదయం 11గంటలు దాటినా యాచారం మండల తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. రోజూ మాదిరి ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన తహసీల్దార్ కార్యాలయం 11 గంటలు దాటినా తాళం వేసి ఉండటం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయం తెరుచుకోక పోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు అధికారుల కోసం ఎదురుచూపులు చూసారు. అయితే భూభారతి రెవెన్యూ సదస్సులు ఉన్నాయనే సాకుతో అటెండర్లు సైతం కార్యాలయాన్ని సకాలంలో తెరవకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పాఠశాలలు, కళాశాలలు తెరుచుకునే సమయంలో విద్యార్థులు కులం, ఆదాయం, రెసిడెన్సీ, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలకోసం వస్తే అధికారులు లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ సదస్సులు కొనసాగినప్పటికీ కార్యాలయంలో జరిగే పనులు యధావిధిగా జరిగేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.