బొంరాస్‌పేట, జూన్ 27 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మన ఊరు-మనబడి కార్యక్రమంతో స్కూళ్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం పాఠశాలల సమగ్ర సమాచారాన్ని పక్కాగా ట్యాబ్‌ల్లో నమోదు చేయడానికి నిర్ణయించింది. ఒకవైపు ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో పాఠాలను బోధించడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల ప్రగతి వివరాలు, పాఠశాలల సమాచారాన్ని ప్రభుత్వం ఏరోజుకారోజూ తెలుసుకునేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నది. పాఠశాలల సమగ్ర సమాచారాన్ని ట్యాబ్‌ల్లో పక్కాగా నమోదు చేయడం ద్వారా పారదర్శకత తీసుకురానున్నది. ప్రస్తుతం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు(సీఆర్పీలు) స్మార్ట్ ఫోన్ల ద్వారా వారానికోసారి పాఠశాలల వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఇక ట్యాబ్‌లను పంపిణీ చేయడం ద్వారా సమాచారమంతా పక్కాగా నమోదు చేయడానికి అవకాశం కలుగుతున్నది. పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో ఎంపిక చేసిన 790 పాఠశాలలకు 823 ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నారు.
పూర్తి సమాచారం
జిల్లాలోని సీఆర్పీలు ప్రస్తుతం మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, విద్యార్థుల ప్రగతి, విద్యార్థుల ప్రవేశాలు, టీసీల జారీ, మార్కుల వివరాల నమోదు, ఉపాధ్యాయుల సమాచారం, మన ఊరు-మనబడి పనుల పురోగతి, ఆదాయ వ్యయాలు, మధ్యాహ్న భోజనం, విద్యార్థులు-తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణ, తొలిమెట్టు అమలు తదితర వివరాలను హెచ్ఎంల నుంచి మ్యాన్యువల్‌గా సేకరించి వారానికోసారి స్మార్ట్ఫోన్ల ద్వారా సంబంధిత యాప్‌లో నమోదు చేస్తున్నారు. ట్యాబ్‌లను పంపిణీ చేసిన తరువాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సమస్య ఉండదు.
హెచ్ఎంలు ప్రతిరోజూ సమాచారాన్ని ప్రగతి వివరాలను ట్యాబ్‌ల్లో నమోదు చేసి మండల, జిల్లా, రాష్ట్రస్థాయికి సమాచారం చేరవేసే అవకాశం కలుగుతుంది. ప్రధానంగా తరగతి గదుల్లో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులను తమ చాంబర్లో ముఖచిత్రం గుర్తింపు ఆధారంగా హాజరు నమోదు చేయనున్నారు. దీంతో హాజరైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు మాత్రమే ట్యాబ్‌ల్లో హాజరు నమోదవుతున్నది. దీంతో గైర్హాజరైన వారు హాజరైనట్లు వేసుకునే అవకాశం ఉండదు. అదేవిధంగా మధ్యాహ్న భోజన వివరాలు కూడా ట్యాబ్‌లో పక్కాగా నమోదవుతాయి. దీనివల్ల ఎలాంటి అవకతవకలకు తావుండదు. పాఠశాలలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, చిత్రాలు ట్యాబ్‌లో వెంటనే నమోదు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను పొందుపరుస్తారు.
ట్యాబ్‌లతో పాఠాలు..
పుస్తకం చదువుతూ పాఠం చెప్పేదానికంటే ట్యాబ్‌ల్లో బొమ్మలను చూపిస్తూ పాఠం చెబితే విద్యార్థులు త్వరగా అర్థం చేసుకుంటారు. అందుకే విద్యాశాఖ అధికారులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పుస్తకాలను ఇంటర్నెట్లో ఉంచారు. ట్యాబ్‌లో ఇంటర్నెట్ ఆన్‌చేసి విద్యార్థులకు పాఠాలు బోధించడానికి అవకాశం కలుగుతుంది. అంటే డిజిటల్ బోధనకు కూడా ట్యాబ్‌లను వినియోగించుకోవచ్చు. ట్యాబ్‌ల పంపిణీతో ప్రధానోపాధ్యాయులకు పేపర్ వర్క్ తగ్గడంతో పాటు నమోదు చేసిన సమాచారం అంతా ట్యాబ్‌లో నిక్షిప్తమై ఎప్పుడంటే అప్పుడు చూసుకునే అవకాశం కలుగుతుంది.
790 పాఠశాలలకు 823 ట్యాబ్‌లు
వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతగా 675 ప్రాథమిక పాఠశాలలకు 702 ట్యాబ్‌లు, 115 ప్రాథమికోన్నత పాఠశాలలకు 121 ట్యాబ్‌లు ఇలా మొత్తం 790 పాఠశాలలకు 823 ట్యాబ్‌లు వచ్చాయి. వీటిని జిల్లాలోని పాఠశాలల హెచ్ఎంలకు పంపిణీ చేస్తున్నారు.
చాలా ఉపయోగం
జిల్లాలోని 790 పాఠశాలలకు 823 ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నాం. పాఠశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ట్యాబ్‌ల్లో నమోదు చేయవచ్చు. ఎఫ్ఎల్ఎన్కు సంబంధించిన పాఠ్య ప్రణాళిక, యాక్టివిటీలు ఇందులో ఉంటాయి. దీనివల్ల విద్యార్థుల్లో పాఠాలు వినాలన్నా ఆసక్తి కలుగుతుంది. హెచ్ఎంలు సమాచారం ఇవ్వడానికి, మేము సమాచారం చేరవేయడానికి ఇవి ఉపయోగపడుతాయి. వీటి ఉపయోగంపై హెచ్ఎంలకు శిక్షణ ఇస్తాం. హెచ్ఎంలు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
– రేణుకాదేవి, డీఈవో వికారాబాద్