మొయినాబాద్, అక్టోబర్ 14 : బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతపై మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని బీఆర్ఎస్ మహిళా విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు స్వప్నాసతీశ్కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భర్తను కోల్పోయి .. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని, సోమవారం జరిగిన సభలో కన్నీరు పెడితే.. మంత్రి పొన్నం ప్రభాకర్ సిగ్గులేకుండా సానుభూతి కోసం డ్రామా అని వ్యాఖ్యానించడం యావత్తు మహిళా లోకాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తప్పని పరిస్థితుల్లో ఆమె రాజకీయాల్లోకి వస్తే..పొన్నం ప్రభాకర్ అవమానించడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి సిగ్గులేని నాయకుల వల్లే మహిళలు రాజకీయాల్లోనికి వచ్చేందుకు భయపడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి పొన్నంకు మహిళలపై గౌరవం లేదని ఈ అంశంతో స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు. వెంటనే పొన్నం ప్రభాకర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.