ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 11: పారిశుధ్య నిర్వహణలో ముందున్న పాఠశాలలకు కేంద్ర సర్కారు ‘స్వచ్ఛ విద్యాలయ్’ పేరిట పురస్కారాలను అందిస్తున్నది. 2017 లో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయింది. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలకు పురస్కారాల ను అందించనున్నది. జాతీయస్థాయికి ఎంపికైన స్కూళ్లకు రూ.60వేల ప్రోత్సాహకం వరించనున్నది. జిల్లాలో 2,962 ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. తెలంగాణ ప్రభుత్వ కృషి, దాతల సహకారంతో పలు ప్రభుత్వ బడులు ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు పాఠశాల లు జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికయ్యే అవకాశం ఉండటంతో స్వచ్ఛ పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రత్యేక యాప్‌లో పొందుపర్చాలని రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు తెలిపారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అందజేస్తున్న ఈ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ‘స్వచ్ఛ విద్యాలయ్ పురస్కార్’ అనే మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో పాఠశాల పేరును రిజిస్టర్ చేసుకుని యూడైస్ కోడ్, పాస్‌వర్డ్‌తో లాగి న్ కావాలి. అందులోని 39 ప్రశ్నలను పూరించి, సంబంధిత ఫొటోలను అప్లోడ్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా అధికారులు స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. నీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్లకు 27, చేతుల శుభ్రతకు 14, నిర్వహణకు 21, విద్యార్థుల సత్ప్రవర్తన, అవగాహనకు 11, కొవిడ్ జాగ్రత్తలకు 15, ఇలా మొత్తం 110 మార్కులు కేటాయించారు. 90 శాతానికి పైగా మార్కులు వస్తే 5 స్టార్ రేటింగ్, 75 శాతానికి పైగా 4 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఇందులో 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్న బడులకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను అందజేస్తారు. జాతీయ స్థాయికి ఎంపికైన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం రూ.60వేల నజరానా కూడా అందించనున్నది.
స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆయా పాఠశాలలకు చేరవేశాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకుని వివరాలను సంబంధిత యాప్‌లో నమోదు చేయాలి. ఫొటోలను కూడా నిక్షిప్తం చేయాలి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
-సుశీందర్‌రావు, డీఈవో రంగారెడ్డిజిల్లా