కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడి సిబ్బంది నిబంధనలు, కొర్రీలతో విసిగిపోయిన అన్నదాతలు తమ ధాన్యాన్ని పక్క రాష్ర్టానికి చెందిన వ్యా పారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో పండించిన ధాన్యంలో దాదాపుగా 60 శాతం వరకు కర్ణాటక రాష్ర్టానికే తరలుతున్నట్లు సమాచారం. అక్కడి వ్యాపారులు రైతుల వద్దకు నేరుగా వచ్చి మద్దతు ధరకంటే అదనంగా రూ.500 చెల్లించి ధాన్యాన్ని కొంటున్నారు. కాగా జిల్లాలో ఖరీఫ్‌లో 1,05,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యం గా పెట్టుకోగా.. కేవలం 34,766 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు.
– వికారాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ)
ఏడాది కాంగ్రెస్ పాలనలో రైతాంగం ఆగమయ్యింది. అధికారంలోకి వచ్చి 12 నెలలు దాటినా పంట పెట్టుబడి సాయం ఇవ్వకుండా.. అనేక కొర్రీలు, నిబంధనలు పెట్టి కొద్ది మంది రైతుల పంట రుణాలనే మాఫీ చేయగా.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకూ సరైన మద్దతు ధర చెల్లించకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని పక్క రాష్ర్టానికి చెందినవారికి విక్రయిస్తున్నారు.
ప్రభుత్వం జిల్లాలో వరి ధాన్యాన్ని కొనేందుకు 126 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా రైతులు తమ పంటను అక్కడ అమ్మేందుకు తీసుకెళ్లకపోవడంతో అవి బోసిపోయాయి. దీంతో అధికారులు వాటిని మూసేశారు. అధికారులు నిర్దేశించిన లక్ష్యంలో సగం ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించలేకపోయారు. వానకాలంలో 1,05,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకోగా.. కేవలం 34,766 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించారు.
అయితే జిల్లాలో పండించిన ధాన్యంలో దాదాపుగా 60 శాతం వరకు కర్ణాటక రాష్ర్టానికి తరలుతున్నట్లు సమాచారం. అక్కడ వరి సాగు తక్కువగా ఉండడం.. ధాన్యానికి డిమాండ్ పెరిగి.. వికారాబాద్ జిల్లాలో పండించిన ధాన్యాన్ని కర్ణాటకకు చెందిన ప్రైవేట్ వ్యాపారులు తెలంగాణకు వచ్చి అధిక ధరకు కొనుగోలు చేసి లారీల ద్వారా తీసుకెళ్తున్నారు. మన దగ్గర క్వింటాల్‌కు రూ.2,320 ఉండగా, అక్కడి వ్యాపారులు క్వింటాల్‌కు మద్దతు ధరతోపాటు రూ.500 అధికంగా నేరుగా చెల్లించి ధాన్యాన్ని కొంటున్నారు. దీంతో జిల్లాలోని తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లోని రైతులు తమ పంటను కర్ణాటక వ్యాపారులకే విక్రయిస్తున్నారు.
ధాన్యాన్ని విక్రయించే సమయంలో తేమ శాతం అంటూ ఏదో విధంగా కొర్రీలు పెట్టే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు.. డబ్బుల చెల్లింపుల్లో అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యాన్ని విక్రయిం చిన రైతులకు రెండు, మూడు రోజుల్లోగా చెల్లింపులు పూర్తి చేస్తామంటూ పౌరసరఫరాల అధికారులు ప్రకటించినా..విక్రయించిన 15-20 రోజుల తర్వాతే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి.
ధాన్యాన్ని సేకరించిన వెంటనే బిల్లులు చేయాల్సిన కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే డబ్బులు వచ్చేందుకు ఆలస్యమవుతున్నదన్న ఆరోపణలున్నాయి. మరోవైపు జిల్లాలో వానకాలంలో 34,766 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 5449 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించగా ఇప్పటివరకు రూ.74 కోట్లను రైతుల ఖాతాల్లో జమ కాగా.. మరో రూ.10 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.